
తెలంగాణలో మరో రెండు నెలల్లో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలకు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డీ శ్రీనివాస్‌ల రాజ్యసభ పదవీకాలం ఈ జూన్ మొదటి వారంతో ముగియనుంది. అయితే ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా ఈ ఇరువురు నేతలకు మరోసారి రాజ్యసభ చాన్స్ కల్పించే పరిస్థితి లేదు. ఇప్పటికే శాసనమండలికి ఎన్నికైన బండ ప్రకాశ్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం మూడు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మూడు స్థానాలు కూడా అధికార టీఆర్‌ఎస్ ఖాతాలోనివే.
అయితే ఇందుకు టీఆర్‌ఎస్‌లో భారీగానే పోటీగా నెలకొంది. పలువురు సీనియర్లు రాజ్యసభ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. 10 మందికి పైగానే టీఆర్ఎస్ నేతలు.. మూడు రాజ్యసభ స్థానాలపై ఆశలు పెట్టుకున్నారు. అయితే గులాబీ బాస్ మాత్రం ఎవరికి అవకాశం కల్పిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బడ్జెట్ సమావేశాలు ముగియడంతో.. ఈ విషయంపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ శ్రేణులు చెబుతున్నాయి.
కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు ప్రస్తుతం 84 సంవత్సరాలు కావడంతో.. ఆయనను వయసు దృష్ట్యా తిరిగి పెద్దల సభకు నామినేట్ కాకపోవచ్చునని టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. టీఆర్‌ఎస్ అధిష్టానంతో విభేదాల కారణంగా గత నాలుగేళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న శ్రీనివాస్ తిరిగి పార్టీ తరఫున రాజ్యసభకు పంపేది లేదని చెబుతున్నాయి. మరోవైపు డీఎస్ కూడా త్వరలోనే టీఆర్‌ఎస్‌ను అధికారికంగా వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీంతో మూడు స్థానాలకు అభ్యర్థులు గులాబీ బాస్ ఎంపిక చేయాల్సి ఉంది. అయితే టీఆర్‌ఎస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.. మాజీ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్‌ను రాజ్యసభకు పంపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజ్యసభకు పంపాలని అనుకునేవారిలో వినోద్ కుమార్ పేరు టాప్‌లో ఉందని టాక్.
కేసీఆర్‌కు సన్నిహితుడిగా పేరున్న వినోద్ కుమార్.. 2014 నుంచి 2019 వరకు కరీంనగర్ ఎంపీగా ఉన్నారు. ఆ సమయంలో లోక్‌సభలో టీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు. అయితే 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. ఇక, కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పర్యటించిన సమయంలో వినోద్ కుమార్ ప్రముఖంగా కనిపిస్తారు. ఢిల్లీలో టీఆర్‌ఎస్ కార్యకలాపాలు చూసుకన్న అనుభవం వినోద్ కుమార్‌కు ఉందని టీఆర్‌ఎస్ శ్రేణులు చెబుతున్నాయి.
మరోవైపు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎంఏ సలీమ్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావులు టీఆర్‌ఎస్ నుంచి రాజ్యసభ రేసులో ఉన్నారు. వీరిలో రెండు నెలల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరిన నరసింహులు.. కేసీఆర్‌తో సన్నిహితంగా మెలుగుతున్నారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన దళిత బంధు పథకంపై ఆయన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు రాజ్యసభ హామీతోనే మోత్కుపల్లి టీఆర్‌ఎస్‌లో చేరారనే ప్రచారం కూడా ఉంది.
ఇక, 2019 ఎన్నికల్లో ఖమ్మం మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డికి టీఆర్‌ఎస్ అధిష్టానం టికెట్ నిరాకరించింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ టికెట్ కోసం శ్రీనివాస్‌రెడ్డి ప్రయత్నించారు. అయితే అది కూడా సాధ్యపడలేదు. అయితే ఆయన రాజ్యసభ సీటుపై ఆశ పెట్టుకున్నారని చెబుతున్నారు. మరోవైపు కొంతకాలంగా పార్టీ అధిష్టానం అసంతృప్తితో ఉన్న శ్రీనివాస్ రెడ్డి.. పక్కదారులు చూస్తున్నారనే ప్రచారం లేకపోలేదు.
ఇటీవల పదవీకాలం ముగిసిన సలీమ్‌కు వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా రెండోసారి పదవి లభించకపోతే మైనారిటీ కోటా కింద రాజ్యసభకు నామినేట్ అయ్యే అవకాశం ఉంది. గతంలో సలీమ్‌కు ఎమ్మెల్సీగా పనిచేశారు.