చండూరులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయంలో ప్రచార సామాగ్రి దగ్దం కావడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్: చండూరులోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయంలో ప్రచారసామాగ్రి దగ్దం కావడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.మంగళవారం నాడు ఉదయం చండూరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయంలో మంటలు వ్యాపించాయి. ఎన్నికల ప్రచార సామాగ్రిని దుండగులు దగ్దం చేశారని కాంగ్రెస్ పార్టీ నేతలు అనుమానిస్తున్నారు.ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
also read:చండూరులో ఎన్నికల ప్రచార సామాగ్రి దగ్ధం: కాంగ్రెస్ ఆందోళన
మునుగోడులో కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ప్రత్యర్ధుల దుశ్చర్యకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. పార్టీ ఆఫీస్ పై దాడిచేసి దిమ్మెలు కూల్చినా మునుగోడులో ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. తమ పార్టీ కేడర్ ను బెదిరించాలని టీఆర్ఎస్, బీజేపీ కుట్రలు పన్నాయని ఆయన చెప్పారు.పార్టీ కార్యాలయంపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయకపోతే ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు.