తెలంగాణలో హంగ్ వస్తుందంటూ బీజేపీ నేత బీఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ ఓట్లు చీల్చి హంగ్ వచ్చేలా బీజేపీ కుట్ర చేస్తోందని , తద్వారా బీఆర్ఎస్‌తో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు
తెలంగాణలో హంగ్ వస్తుందంటూ బీజేపీ నేత బీఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. శనివారం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో జరిగిన క్రైస్తవ హక్కుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో హంగ్ వస్తే బీజేపీతో కలిసి బీఆర్ఎస్సేనని రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీని నిలువరించడానికి కాంగ్రెస్ కొట్లాడుతుందని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఓట్లు చీల్చి హంగ్ వచ్చేలా బీజేపీ కుట్ర చేస్తోందని రేవంత్ ఆరోపించారు. తద్వారా బీఆర్ఎస్‌తో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తోందని .. ఈ కుట్రను భగ్నం చేయడానికి కాంగ్రెస్ పార్టీకి అండగా వుండాలని ఆయన ప్రజలను కోరారు. కర్ణాటకలో జేడీఎస్ మాదిరిగా తెలంగాణలో బీజేపీ వ్యవహరించాలని చూస్తోందని రేవంత్ రెడ్డి చురకలంటించారు.
ALso Read: తెలంగాణలో ‘‘హంగ్’’ తథ్యం .. బీజేపీ నేత బీఎల్ సంతోష్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ తనను కొడంగల్‌లో పడగొడితే.. ప్రజలు మల్కాజిగిరిలో నిలబెట్టారని తెలిపారు. బీజేపీ-బీఆర్ఎస్‌లది ఫేవికాల్ బంధమని, తమను ఎంఐఎం కూడా తిడుతోందని రేవంత్ ఫైర్ అయ్యారు. కొప్పుల ఈశ్వర్ తన పక్కన కూర్చొంటే కేసీఆర్ సహించలేరని.. కాంగ్రెస్‌లో దళితుడైన ఖర్గే ఏఐసీసీ చీఫ్ అయ్యాడని ఆయన తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మోడీ పతనం స్టార్ట్ అయినట్లేనని.. రాష్ట్రాన్ని మరో మణిపూర్ చేయాలని బీజేపీ చూస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
బీఆర్ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని.. కేసీఆర్‌ను గెలిపిస్తే, మోడీని గెలిపించినట్లేనని ఆయన పేర్కొన్నారు. అసదుద్దీన్ ఒవైసీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మైనార్టీలు భయపడాల్సిన పనిలేదని.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో క్రిస్టియన్‌ల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రజల ఆత్మరక్షణ కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని రేవంత్ రెడ్డి వెల్లడించారు.