ప్రాజెక్ట్‌ల పేరుతో అరాచకాలు.. ప్రశ్నిస్తే లాఠీఛార్జీలు, రైతుల చేతికి బేడీలు : కేసీఆర్‌పై రేవంత్ ఫైర్

By Siva KodatiFirst Published Jul 1, 2022, 7:52 PM IST
Highlights

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్ట్ లు, నష్టపరిహారం, నిర్వాసితుల సమస్యలపై శుక్రవారం తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. పరిహారం గురించి ప్రశ్నిస్తే.. లాఠీఛార్జ్ చేసి, సంకెళ్లు కూడా వేస్తున్నారని ఆయన ఫైరయ్యారు. 

రాష్ట్రంలోని సమస్యలు, సాగునీటి ప్రాజెక్ట్ లను తెలుపుతూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) శుక్రవారం తెలంగాణ సీఎం కేసీఆర్ కు (kcr) లేఖ రాశారు. వందల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్ట్ లు కడుతున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల నిర్వాసితులు అవుతున్న వారు పరిహారం గురించి ప్రశ్నిస్తే.. లాఠీఛార్జ్ చేసి, సంకెళ్లు కూడా వేస్తున్నారని రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. గతంలో ఆదివాసీ మిర్చి రైతులకు కూడా బేడీలు వేశారని.. సమస్యను పరిష్కరించకుండా జాప్యం చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. 

నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే పనులు చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని రేవంత్ కోరారు. 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని.. ఈ విషయంలో నిర్వాసితుల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలోని నిర్మిస్తోన్న గౌరవెల్లి ప్రాజెక్ట్ రీ డిజైన్ చేయడం వల్ల మునిగిపోయే గ్రామాల సంఖ్య 1 నుంచి 8కి పెరిగిందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

Also REad:ఇంటర్ విద్యార్థుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది.. ఆ ఫీజులను మినహాయించాలి: రేవంత్ రెడ్డి

మరోవైపు.. ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలపై (inter students suicide) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు. జీవితం విలువను అర్థం చేసుకోవాలని.. ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోవద్దని విద్యార్థులకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా రీవాల్యుయేషన్, సప్లిమెంటరీ పరీక్షల ఫీజును మినహాయించాలని తెలంగాణ సీఎం కార్యాలయాన్ని, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రేవంత్ డిమాండ్ చేశారు.

ఇకపోతే.. మార్కులు తక్కువ వచ్చాయని కొందరు... పాస్ అవ్వలేదని మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. హైదరాబాద్ చింతల్ బస్తీకి చెందిన ఇంటర్ విద్యార్ధి గౌతమ్ కుమార్ పాసయ్యాడు. కానీ మార్కులు అనుకున్న దానికంటే తక్కువ రావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆ ఆవేదనతోనే ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు సైఫాబాద్ పోలీసులు.

click me!