
రైతు వేదికలను పునరుద్ధరించి వ్యవసాయ విస్తరణాధికారులను నియమించి రైతులను ఆదుకోవాలని టీపీసీసీ (tpcc) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy) తెలంగాణ ప్రభుత్వాన్ని (telangana govt) డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన సీఎం కేసీఆర్‌కు (kcr) లేఖ రాశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు వెంటనే రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని రేవంత్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మిర్చి, పత్తి రైతుల సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకోవాలని కోరారు. రుణ ప్రణాళిక, ధాన్యం కొనుగోళ్లు, కల్తీ విత్తనాలు.. తదితర సమస్యలతో రైతులు సతమతమవుతున్నారని రేవంత్ లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో సరైన వ్యవసాయ విధానం లేదని.. మిర్చి, పత్తి రైతుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే రెండు నెలల్లో 20మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని రేవంత్ పేర్కొన్నారు. ఇటీవల మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్యం వేదికలు మహబూబాబాద్ ప్రాంతాల్లో పర్యటించి నివేదికలు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. అప్పుల బాధలు భరించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని... లక్ష రూపాయల రుణ మాఫీ వెంటనే అమలు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్లోని పిల్లలను ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించి ప్రభుత్వం ఉచితంగా చదివించాలని ఆయన కోరారు. రైతులకు కల్పించే అన్ని సౌకర్యాలు కౌలు రైతులకూ కల్పించాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
అంతకుముందు Telangana Assembly Budget సమావేశాల చివరి రోజున ద్రవ్య వినిమయ బిల్లును సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుపై ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ చర్చను ప్రారంభించారు. ఆ తర్వాత CLP నేత ఈ చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన అంశాలపై సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు అనేక సమస్యలకు దారి తీస్తాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఫెడరల్ స్పూర్తికి కేంద్రం దెబ్బతీస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. IAS, IPS లపై కేంద్రం పెత్తనంం తీసుకోవాలని చూస్తోందన్నారు.ఈ విషయమై తాము కేంద్రం తీరును తీవ్రంగా తప్పుబట్టామని కేసీఆర్ చెప్పారు.దేశంలో ఫెడరలిజం ప్రమాదంలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రపంచ ఆర్ధిక వ్యవస్థతో పాటు దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా కొత్త పుంతలు తొక్కుతోందని కేసీఆర్ చెప్పారు. దేశ తొలి బడ్జెట్ 190 కోట్లు, అయితే అందులో 91 కోట్లు రక్షణ శాఖకే కేటాయించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. తాను విద్యార్ధిగా ఉన్న సమయంలో ఏపీ బడ్జెట్ రూ.680 కోట్లు అని ఆయన ప్రస్తావించారు. ఇప్పుడేమో బడ్జెట్ లక్షల కోట్లకు చేరుకుందన్నారు. ప్రస్తుతం భారత దేశం అప్పు 152 లక్షల కోట్లుగా ఉందన్నారు. మన కన్నా అప్పలు ఎక్కువ చేస్తున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు.ఇప్పుడు అప్పులు కూడా వనరుల సమీకరణగానే చూడాలని కేసీఆర్ సూచించారు.అప్పులు తీసుకోవడంలో మనం 25వ స్థానంలో ఉన్నామని కేసీఆర్ వివరించారు.అప్పుల విషయంలో ఆందోళన అవసరం లేదన్నారు. మన రాష్ట్రం అప్పుల శాతం 23 శాతం మాత్రమేనని చెప్పారు. అప్పుల విషయంలో భట్టి విక్రమార్కు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.