పీసీసీ చీఫ్‌గా నాకే ఎన్నోసార్లు కుర్చీ ఇవ్వలేదు.. రాజగోపాల్ రెడ్డికి నామోషీనా : రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Aug 6, 2022, 8:52 PM IST
Highlights

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మరోసారి విమర్శలు గుప్పించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పార్టీ మారుతున్న వాళ్లపై కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందన్నారు.  స్థాయి లేకపోయినా వేదికపై కాలు మీద కాలు వేసుకుని కూర్చొంటారని ఆయన ధ్వజమెత్తారు.
 

పార్టీ మారుతున్న వాళ్లపై కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy)  . బీజేపీ (bjp) ఇంకొంత మంది కోవర్టులను తయారు చేయొచ్చని ఆయన ఆరోపించారు. కండువా కప్పుకున్నాక పరిస్ధితి ఎలా వుంటుందో చూడాలని రేవంత్ వ్యాఖ్యానించారు. స్థాయి లేకపోయినా వేదికపై కాలు మీద కాలు వేసుకుని కూర్చొంటారని ఆయన ధ్వజమెత్తారు. పీసీసీ చీఫ్‌గా నాకే చాలాసార్లు కుర్చీ ఇవ్వరని, కానీ కాంగ్రెస్‌లో స్వేచ్ఛ వుంటుందని రేవంత్ అన్నారు. రాజకీయాల్లో సందర్భాలు... పదవులు మారుతాయని చెప్పారు. గుర్తింపు, హోదా ఇచ్చిన పార్టీలో పనిచేయడానికి రాజగోపాల్ రెడ్డికి (komatireddy raja gopal reddy) నామోషీనా అని రేవంత్ ప్రశ్నించారు. 

కాంగ్రెస్‌ను (congress) విధ్వంసం చేయాలనేది బీజేపీ కుట్ర అని ఆయన ఆరోపించారు. చంద్రబాబుతో (chandrababu naidu) కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నప్పుడు.. తన గురించి ఎందుకు మాట్లాడుతున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కష్టాల్లో వున్నప్పుడు తాను విడిచిపెట్టలేదని... ఆయన ఏపీ సీఎంగా, ఎన్డీయేలో వున్నప్పుడు గౌరవప్రదంగా కలిసి టీడీపీని వీడానని టీపీసీసీ చీఫ్ గుర్తుచేశారు. తెలుగుదేశానికి రాజీనామా చేసిన రోజున గన్‌మెన్‌లను, పీఏని, అసెంబ్లీ అధికారులు ఇచ్చిన బ్యాంక్ ఖాతాను కూడా క్లోజ్ చేశానని రేవంత్ గుర్తుచేశారు. 

Also Read:రేవంత్ సైన్యం దొంగల ముఠా.. పెద్ద పెద్ద నాయకులు బీజేపీలో చేరతారు: రాజగోపాల్ రెడ్డి

ఇకపోతే...నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నానన్న కేసీఆర్ ప్రకటనపైనా రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని బట్టి నరేంద్ర మోడీ, కేసీఆర్ మధ్య జరిగిన చీకటి ఒప్పందం మరోసారి నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. చాలా సందర్భాలలో నీతి ఆయోగ్ సమావేశాలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి హాజరుకాని పక్షంలో వారి తరపున మంత్రులను పంపిస్తారని రేవంత్ గుర్తుచేశారు. నీతి ఆయోగ్ సమావేశాన్ని ఎందుకు బహిష్కరించారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడుగుతారని భావించామని... ప్రధానిని ముఖాముఖిగా ప్రశ్నించే అవకాశం వుండేది కదా అని ఆయన అన్నారు. 

జీఎస్టీ బిల్లు తెచ్చినప్పుడు మోడీని కేసీఆర్ పొగిడారంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. ఏడున్నరేళ్లుగా కేసీఆర్.. మోడీతో కలిసి నడిచారని ఆయన గుర్తుచేశారు. మాటలు వ్యతిరేకంగా కనిపిస్తున్నా.. చర్యలు మోడీకి అనుకూలంగా వున్నాయని రేవంత్ దుయ్యబట్టారు. కేంద్రంలో ఈడీలాగే , ఎస్ఐబీ, టాస్క్‌ఫోర్స్‌ను తన వ్యతిరేకులపై కేసీఆర్ ప్రయోగిస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఆరోపించారు.  మోడీకి కేసీఆర్ ఏకలవ్య శిష్యుడని రేవంత్ అన్నారు. తెలంగాణలో దర్యాప్తు , నిఘా వ్యవస్థలను ప్రతిపక్షాలను టార్గెట్ చేయడానికి ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. నీతి ఆయోగ్ మీటింగ్‌కు కేసీఆర్ స్వయంగా హాజరుకావాలని రేవంత్ సూచించారు. ప్రధానిని నిలదీయడానికి వచ్చిన ఛాన్స్‌ను ఉపయోగించుకోవాలని రేవంత్ సూచించారు.

click me!