తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీలు వ్యవహరిస్తున్న తీరు అసహ్యకరంగా మారిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. పార్టీ మారాలని బీజేపీ నేతలు సంప్రదించినట్టుగా చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని రేవంత్ రెడ్డి కోరారు.
హైదరాబాద్: పార్టీ మారాలని బీజేపీ నేతలు తనను సంప్రదించారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై విచారణ చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారంనాడు హైద్రాబాద్ గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.బీజేపీ నేతలు తనను పార్టీలో చేరాలని కోరారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ మీడియా సమావేశంలో ప్రకటించారన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల పార్టీ సమావేశంలో కేసీఆర్ కూడా చెప్పారన్నారు.
మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో ప్రలోభాలకు గురైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల స్టేట్ మెంట్లు రికార్డు చేసి ఈ కేసుతో సంబంధం ఉన్న వారికి సిట్ నోటీసులు పంపిస్తుందన్నారు. అదే తరహలో ఎమ్మెల్సీ కవిత స్టేట్ మెంట్ ను రికార్డు చేసి సంబంధం ఉన్నవారికి నోటీసులు పంపాలని సిట్ చీఫ్ సీవీ ఆనంద్ ను కోరారు రేవంత్ రెడ్డి.
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే విషయమై సిట్ ఏర్పాటు చేసిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కవిత పేర్కొన్న అంశాన్ని కూడా రికార్డు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.కవిత చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని సిట్ బృందం ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. కవితను పార్టీ మారాలని ఎవరు కోరారు,. ఏం ఆఫర్ ఇచ్చారో సిట్ రికార్డు చేయాలని ఆయన కోరారు. కవితను ప్రలోభాలు పెట్టినవారిని కూడా నోటీసులు ఇవ్వాలన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అసహ్యకర పరిస్థితులకు బీజేపీ, టీఆర్ఎస్ లు తెర తీశాయని ఆయన విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ లు కలిసి తెలంగాణ రాజకీయాలను కలుషితం చేస్తున్నాయన్నారు. అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలను నమ్ముకుని కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
also read:తెలంగాణ భవన్ ముట్టడికి బీజేపీ: నాంపల్లిలోనే అడ్డుకున్న పోలీసులు
ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుతో సంబంధం లేదని చెబతున్న బీజేపీ నేతలు ఎందుకు ఇన్‌వాల్వ్ అవుతున్నారో చెప్పాలన్నారు. కేసు విచారణను నిలిపివేయాలని బీజేపీ నేతలు కోర్టుకు ఎందుకు వెళ్లి స్టేలు తెచ్చుకొంటున్నారో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలతో కేంద్రం, స్టేట్ జీఎస్టీ, ఏసీీబీ, పోలీసులతో రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవడం ద్వారా రాష్ట్రంలో ఎవరూ కూడా స్వేచ్ఛగా నిద్రపోయే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి చెప్పారు.
2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వ్యాపార సంస్థలను వేధింపులకు గురి చేయలేదన్నారు. పార్టీలు మారిన వారిని వేధించలేదన్నారు.
తమకు నచ్చనివారిని ఈ రెండు పార్టీలు తుదముట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతు రుణ మాఫీ జరగని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి నెలకొందన్నారు.