
వరంగల్ డిక్లరేషన్ (warangal declaration) చారిత్రాత్మకమన్నారు టీపీసీసీ చీఫ్ (tpcc) రేవంత్ రెడ్డి (revanth reddy) . ఆదివారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ సాక్షిగా రైతులకు భరోసా కల్పించామని రేవంత్ అన్నారు. వరంగల్ డిక్లరేషన్‌తో కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో వున్న పార్టీల్లో ప్రకంపనలు వచ్చాయని.. దీంతో కలుగులో నుంచి అందరూ బయటకు వచ్చారని రేవంత్ పేర్కొన్నారు. బీజేపీ (bjp), టీఆర్ఎస్ (trs) , ఎంఐంఎం (mim) నాయకులు మూకుమ్మడిగా కాంగ్రెస్‌పై దాడి చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
తండాలలో, గూడెలలో, మారుమూల పల్లెల్లోనూ కాంగ్రెస్ (congress) ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ విధానానికి, రైతు రుణమాఫీ, గిట్టుబాటు ధర, ధరణీ పోర్టల్ రద్దు సహా 9 తీర్మానాలు ప్రజలకు చేరాయని రేవంత్ పేర్కొన్నారు. దీనిపై తమకు సంతోషంగా వుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర, ఆయా రాష్ట్రాల్లో వున్న స్థితిగతులు, ఆర్ధిక పరిస్ధితిని బట్టి పరిపాలనలో చేపట్టవలసిన చర్యలను కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టంగా ఒక విధానాన్ని ప్రకటించిందని ఆయన తెలిపారు. వరంగల్ డిక్లరేషన్ తెలంగాణ రైతాంగం ఆమోదం పొందడమనేది తమకు ఒక ప్రోత్సాహం, విశ్వాసమని రేవంత్ వెల్లడించారు.
టీఆర్ఎస్, కేటీఆర్ అహంభావంతో ప్రజాస్వామ్యం అంటే అవగాహన లేని విధంగా మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. రాహుల్ ఒక పొలిటికల్ టూరిస్ట్ అని తెలంగాణకు ఇలాంటి వారు వస్తుంటారు, పోతుంటారు మేం మాత్రం ఇక్కడే వుంటామని కేటీఆర్ మాట్లాడుతున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ (rahul gandhi) అమేధీలో ఓడిపోయారని.. కానీ వయ్‌నాడ్‌లో గెలిచారని రేవంత్ గుర్తుచేశారు. యూత్ కాంగ్రెస్‌లో పనిచేసిన సమయంలో కేసీఆర్ (kcr) సింగిల్ విండో డైరెక్టర్‌గా ఓడిపోయినా.. ఆయనను అప్పటి కాంగ్రెస్ పెద్దలు ఛైర్మన్‌గా నియమించారని టీపీసీసీ చీఫ్ తెలిపారు.
కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టేంది కాంగ్రెస్సేనని.. ఈ పార్టీ జెండా నీడలో రాజకీయ ఓనమాలు దిద్దిన నీ తండ్రికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్‌ను తిడుతున్నావంటే ముందు కేసీఆర్ చెంపలు వాయించాలని రేవంత్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో చేరి తన తండ్రి తప్పు చేశారని.. తర్వాత తమ పార్టీపై మాట్లాడితే బాగుంటుందంటూ ఆయన హితవు పలికారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ఓటమితోనే మొదలైందని.. సింగిల్ విండో డైరెక్టర్‌గా, ఎమ్మెల్యేగా రెండోసారి ఓడిపోయారని రేవంత్ గుర్తుచేశారు.
సిద్ధిపేట ఎమ్మెల్యేగా వున్న కేసీఆర్ కరీంనగర్ పారిపోయాడని.. అక్కడ ప్రజలు తిరస్కరిస్తారేమోనని పాలమూరు, అక్కడి జనాన్ని వంచించిన తర్వాత మెదక్ పార్లమెంట్ స్థానానికి పారిపోయాడని ఆయన దుయ్యబట్టారు. మెదక్ ప్రజల ఆకాంక్షలను బొందపెట్టిన తర్వాత గజ్వేల్ శాసనసభకు పారిపోయారని .. పారిపోవడానికి పట్టా ఎవరికైనా వుందంటే అది కేసీఆర్‌కే వుందంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. పారిపోవడంలో కేసీఆర్ డాక్టరేట్ పొందారని.. ఎదుటివాళ్లను అనే ముందు నాలుగు వేళ్లు తమనే చూపిస్తాయని ఆయన చురకలు వేశారు.