కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని నేను అన్నానా.. కూనంనేని వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్

By Siva KodatiFirst Published Sep 25, 2022, 9:00 PM IST
Highlights

సీపీఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని తాను అనలేదని...  అనని మాటను అన్నట్లుగా కూనంనేని సాంబశివరావు చిత్రీకరిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. 

కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని తాను అనలేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాను అనని మాటను అన్నట్లుగా సీపీఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చిత్రీకరిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. మీ ఎమ్మెల్యేలను కొనుక్కున్న వారితో ఎలా కలిశారని మాత్రమే అన్నానని టీపీసీసీ చీఫ్ పేర్కొన్నారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఆదివారం జరిగిన ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. గిరిజనులకు వేలాది ఎకరాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని రేవంత్ గుర్తుచేశారు. 

ఎక్కడో మారుమూల తండా నుంచి వచ్చిన బలరాం నాయక్‌కు కేంద్ర మంత్రిగా, శంకర్‌నాయక్‌కు జిల్లా అధ్యక్షుడిగా కాంగ్రెస్ అవకాశమిచ్చిందని టీపీసీసీ చీఫ్ పేర్కొన్నారు. గత ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్, బీజేపీ గిరిజనులకు ఏం చేశాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన భూములను కేసీఆర్ తిరిగి లాక్కుంటున్నారని.. ఎంపీగా, ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి ఏం చేశారని ఆయన నిలదీశారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి స్రవంతిని గెలిపించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

ALso Read:టీడీపీ నా పుట్టినిల్లు.. కాంగ్రెస్‌కు కోడలిలాంటోన్ని, చంద్రబాబూ ఈ పార్టీ మనిషే : రేవంత్ వ్యాఖ్యలు

అంతకుముందు సంస్థాన్ నారాయణ పురం మండలంలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను అడ్డు తొలగించుకునేందుకు కేసీఆర్ తనపై 120 కేసులు పెట్టారని, పేదల పక్షాన కొట్లాడి జైలుకెళ్లానే తప్పించి దొంగతనం చేసి జైలుకు పోలేదన్నారు. తాను తిన్న చిప్పకూడు సాక్షిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని రేవంత్ స్పష్టం చేశారు. 

చంద్రబాబు మనిషి కాంగ్రెస్ పార్టీలో వుంటాడా అని ఆయన ప్రశ్నించారు. ఒకప్పుడు చంద్రబాబు కూడా కాంగ్రెస్ మనిషేనని రేవంత్ గుర్తుచేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి కోడలు లాంటి వాడినని ఆయన అన్నారు. పుట్టిల్లు అయిన టీడీపీ నుంచి మెట్టినిల్లు అయిన కాంగ్రెస్‌లోకి వచ్చానని రేవంత్ పేర్కొన్నారు. చంద్రబాబు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే టీడీపీలోకి వెళ్లారని ఆయన గుర్తుచేశారు. అప్పట్లో బిడ్డగా టీడీపీ గౌరవం నిలబెడితే.. ఇప్పుడు కోడలిగా కాంగ్రెస్ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తానని రేవంత్ స్పష్టం చేశారు. 

మునుగోడు నియోజకవర్గంలోని గ్రామాలకు సరైన రోడ్లు వేయలేని వారు.. ఇక్కడ అభివృద్ధి చేస్తారా అని మండిపడ్డారు. అభివృద్ది చేయని వారికి ఓట్లు అడిగే హక్కు కూడా లేదని తేల్చిచెప్పారు. గతంలో కమ్యూనిస్ట్‌లను అవమానించిన కేసీఆర్‌.. ఇప్పుడు వాళ్ల కాళ్లు పట్టుకుంటున్నారని రేవంత్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ నుంచి పార్టీలు మారేవారే కోసం బీజేపీ, టీఆర్ఎస్‌లు గోతికాడి నక్కల్లా ఎదురుచూస్తున్నాయని టీపీసీసీ చీఫ్ చురకలంటించారు. 
 

click me!