
రైతు సమస్యలపై ప్రభుత్వం వింత వైఖరి అవలంబిస్తోందన్నారు టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) . ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. దళారులు మోసం చేయకుండా వుండటానికే ఎంఎస్‌పీ వుందని రేవంత్ చెప్పారు. వరి ధాన్యం క్వింటాల్‌కు రూ.400 వున్న ధరను కాంగ్రెస్ వెయ్యికి పెంచిందని ఆయన గుర్తుచేశారు. మోడీ (narenedra modi) ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే నల్లచట్టాలు (farm laws) తెచ్చిందని ఆయన మండిపడ్డారు.
రైతులను బానిసలుగా మార్చాలని ప్రయత్నిస్తే ప్రజలు తిరగబడ్డారని.. అందుకే మోడీ క్షమాపణ చెప్పి చట్టాలను వెనక్కి తీసుకున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. యూపీ, పంజాబ్ ఎన్నికల కోసమే చట్టాలను వెనక్కి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. సాగు చట్టాలను మళ్లీ తెస్తామని కేంద్ర మంత్రి తోమర్ (narendra singh tomar) వ్యాఖ్యలు చేయడం దారుణమని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలకు ఇప్పటి వరకు పరిహారం అందలేదని.. కనీసం రైతుల వివరాలను సేకరించలేదని ఆయన దుయ్యబట్టారు.
అటు మంత్రి కేటీఆర్ సైతం సాగు చట్టాలపై స్పందించారు. ఎన్నికల కోసమే నరేంద్ర మోడీ ప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చేసిందా అని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. శనివారం సాయంత్ర ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే తనకు అలాగే అనిపిస్తోందని అన్నారు. పలు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రధాని రైతులకు క్షమాణలు చెప్పారేమో అని సందేహం వ్యక్తం చేశారు. బీజేపీ పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలు అవలంభించే పార్టీగా మారిపోయిందని ఆరోపించారు. ఎన్నికల బీజేపీ కొత్త విధానాలను అవలంభిస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వమే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని, మళ్లీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వాటిని తిరిగి తీసుకొస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.
కాగా.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు సుదీర్ఘకాలం పాటు ఉద్యమం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో గుడారాలు వేసుకొని 2020 ఆగస్టు నెల నుంచి శాంతియుతంగా నిరసనలు తెలిపారు. ఆ పోరాటం 2021 డిసెంబర్ 15వరకు సాగింది. ఈ పోరాటంలో దాదాపు 750 మంది రైతులు ఈ పోరాటంలో అసువులుబాసారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా.. అదరకుండా, బెదరకుండా ఉద్యమం కొనసాగించారు.
నిరసనలు ఆపాలని ప్రభుత్వం ఎన్నో సార్లు విన్నవించినా..రైతులు ఆందోళనలు కొనసాగించారు. సాగు చట్టాలు రద్దు చేసేంత వరకు తమ పోరాటం ఆగదని అన్నారు. సుధీర్ఘ కాలం పాటు జరిగిన ఉద్యమం, రైతుల తెగింపు చూసి చివరికి ప్రభుత్వం దిగి వచ్చింది. కొత్త సాగు చట్టాలు రద్దు చేస్తున్నామని ప్రకటించింది. ఈ విషయంలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేశారు. రైతుల మంచి కోసమే నూతన చట్టాలు తీసుకొచ్చామని అన్నారు. కానీ చట్టాల వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించలేకపోయామని అన్నారు. రైతులకు తాను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు.