ఐదు అంశాలతో యూత్ డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది,. అధికారంలోకి వచ్చిన తర్వాత యూత్ డిక్లరేషన్ ను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్: ఐదు అంశాలతో కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ను ప్రకటించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి యూత్ డిక్లరేషన్ లోని అంశాలను ప్రకటించారు. ప్రతి ఏటా జూన్ రెండున జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందన్నారు.అధికారంలోకి వచ్చిన వెంటనే యూత్ డిక్లరేషన్ ను అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన యువ సంఘర్షణ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఐదు అంశాలతో యూత్ డిక్లరేషన్ ను రేవంత్ రెడ్డి ప్రకటించారు.
హైద్రాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకటించేందుకు వచ్చిన ప్రియాంక గాంధీకి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఓయూ, కాకతీయ విశ్వ విద్యాలయాలు కావన్నారు. ఈ రెండు యూనివర్శిటీలు ఆత్మగౌరవ ప్రతీకలుగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి చాటిన వేదికలుగా ఆయన పేర్కొన్నారు.అంతేకాదు ఈ యూనివర్శిటీలు తెలంగాణ పౌరుషానికి వేదికలుగా నిలిచాయన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 12.5 ఉద్యోగాలుంటే రాష్ట్ర విభజనలో తెలంగాణకు 5.3 ఉద్యోగాలను కేటాయించినట్టుగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తొలి ఏడాది 1.07 లక్షల ఖాళీలు భర్తీ చేస్తామని కేసీఆర్ మాటిచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారంగా రాష్ట్రంలో 1.9 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 2.5 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు దాటినా కూడా ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదన్నారు.
అమరవీరుల ఉద్యమకారులకు గుర్తుగా తొలి డిక్లరేషన్ అమరవీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అమరవీరుల కుటుంబాలకు రూ. 25 వేల పెన్షన్ అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అమరవీరులకు సముచిత గుర్తింపు ఇచ్చే బాధ్యతను తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పార.
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలనుభర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన ప్రకటించారు. సెప్టెంబర్ 17న నియామకపత్రాలను లబ్దిదారులకు అందిస్తామన్నారు. ప్రతి నిరుద్యోగికి రూ. 4 వేల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. ప్రభుత్వం నుండి రాయితీ పొందిన ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాల కల్పనలో 75 శాతం స్థానికులకు కల్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో మరో నాలుగు ట్రిపుల్ ఐటీ సంస్థలను ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. విద్య, ఉపాధి సమస్యలపై యూత్ కమిషన్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. నిరుద్యోగ యువతకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. ఏడు జోన్లలో ఎంప్లాయిమెంట్, నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. గల్ఫ్ కార్మికులను ఆదుకొనేందుకు చట్టం తెస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. మోసం చేసే ఏజంట్లను నియంత్రిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
విద్యార్ధుల ఫీజు రీఎంబర్స్ మెంట్, పాత బకాయిలను చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆదిలాబాద్, మెదక్, ఖమ్మంలలో వర్శిటీలు తీసుకువస్తమని రేవంత్ రెడ్డి తెలిపారు. స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుతో గ్రామీణ యువతకు చేయూత అందిస్తామన్నారు. విద్యార్ధినులకు ఉచితంగా ఎలక్ట్రిక్ బైక్ లను ఉచితంగా అందిస్తామన్నారు. టీఎస్‌పీఎస్‌సీ ని బలోపేతం చేస్తామన్నారు. టీఎస్‌పీఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని ఆయన ఆరోపించారు.