తీవ్ర అనారోగ్యంతో గత మూడు వారాలుగా చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న నిన్న(శనివారం) కర్ణాటక రాజధాని బెంగళూరులో మృతిచెందారు. ఆయన అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్ లో జరగనున్నాయి.
హైదరాబాద్ : నందమూరి కుటుంబానికి చెందిన హీరో తారకరత్న మరణం తెలుగు సినీపరిశ్రమ దు:ఖంసాగరంలో మునిగింది. గత మూడు వారాలుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్యం పూర్తిగా క్షీణించి శనివారం(నిన్న) తుదిశ్వాస విడిచారు. దీంతో నందమూరి కుటుంబం ఆయన భౌతిక కాయాన్ని ప్రత్యేక అంబులెన్స్ లో తరలించగా ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ కు చేరుకుంది.
హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా మోకిలలోని నివాసంలో తారకరత్న భౌతిక కాయాన్ని కుటుంబసభ్యులు, బంధువుల సందర్శనార్థం వుంచారు. సినీ ప్రముఖులు తారకరత్నకు నివాళి అర్పించి కుటుంబసభ్యులను ఓదార్చేందుకు భారీగా ఆయన నివాసానికి భారీగా చేరుకుంటున్నారు. నందమూరి అభిమానులు కూడా తమ అభిమాన నటుడిని కడసారి చూసి తుదివీడ్కోలు పలకడానికి భారీగా చేరుకుంటున్నారు.
అయితే తారకరత్న భౌతిక కాయాన్ని రేపు(సోమవారం) అభిమానుల సందర్శనార్థం ఫిలింనగర్ లోని ఫిలిం చాంబర్ లో వుంచనున్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అక్కడే వుంచి ఐదు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నందమూరి కుటుంబసభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.
Read More టీడీపీ బద్దశత్రువు విజయసాయిరెడ్డి తారకరత్నకు మామ ఎలా అయ్యాడు? భార్య అలేఖ్య షాకింగ్ డిటైల్స్!
చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న తారకరత్న అస్వస్థకు గురయ్యారు. జనాలమధ్యలో వుండగా తీవ్ర అస్వస్థతకు గురయి ఒక్కసారిగా కుప్పకూలిపోయిన తారకరత్నను కుప్పం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి బెంగుళూరుని నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడే ఆయన గత 22 రోజులుగా చికిత్స పొందారు.
వైద్యులు ఎంత ప్రయత్నించినా తారకరత్న ప్రాణాలను కాపాడలేకపోయారు. హాస్పిటల్లో చేరినప్పటి నుండి ఆయన పరిస్థితి క్రిటికల్ గానే వుండటంతో ఐసియూలోనే వుంచి చికిత్స అందించారు. విదేశాల నుండి ప్రత్యేక వైద్యబృందాలను తీసుకువచ్చి మెరుగైన చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. నందమూరి కుటుంబసభ్యులను, సినీప్రియులను దు:ఖంలో ముంచి తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దిగ్గజ నటుడు సీనియర్ ఎన్టీఆర్ మనువడైన తారకరత్న 1983లో హైదరాబాద్ లో జన్మించారు. ఇక నటుడిగా 2002లో వచ్చిన ‘ఒకటో నంబర్ కుర్రాడు’ చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. చిత్రానికి రెస్పాన్స్ రావడంతో పాటు తారకరత్నకూ మంచి పేరును తీసుకొచ్చి పెట్టింది. ఆ తర్వాత ‘యువరత్న’, ‘భద్రాది రాముడు’, ‘అమరావతి’, తదితర చిత్రాలతో అలరించారు. చివరిగా ‘S5 నో ఎగ్జిట్’ కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి సినిమాలు చేస్తున్నారు. మరోవైపు రాజకీయాల్లోనూ బిజీ కాబోతున్నారు. తమ కుటుంబ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలోనే చేరి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలోనూ ఉన్నారు. కానీ ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది.