శుక్ర, శనివారాల్లోనూ భారీ నుండి అతి భారీ వర్షాలు... తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక

By Arun Kumar PFirst Published Jul 16, 2021, 12:53 PM IST
Highlights

తెలంగాణకు మరో రెండురోజులు కూడా వర్షం ముప్పు పొంచివుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.ఈ మేరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. 

హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా గతకొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరికొన్నిరోజులు ఇలాగే కొనసాగుతాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, రేపు (శుక్ర, శనివారం) రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగతాచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని ప్రకటించారు. 

రాష్ట్రంలోని రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటతో పాటు వరంగల్‌ అర్బన్‌, గ్రామీణం, మహబూబాబాద్‌, కరీంనగర్‌, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని... ప్రజలు, అధికారులు అప్రమత్తంగా వుండాలని సూచించారు. హైదరాబాద్‌లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

video  బహిర్భూమికి వెళ్లి... ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుమధ్యలో చిక్కుకున్న యువకులు

ఇక గత మూడు నాలుగు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైద్రాబాద్ లో గత బుధవారం రికార్డుస్థాయిలో  వర్షపాతం నమోదైంది. ఇలా నగరంలో సాయంత్రం నుండి రాత్రి వరకు కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  

అత్యధికంగా ఉప్పల్ లో 20 సెం.మీ, హయత్‌నగర్ లో 19.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. సరూర్‌నగర్ లో  17 సెం.మీ. వర్షపాతం నమైదైంది. ఈ వర్షానికి సరూర్ నగర్ చెరువు కింద  లోతట్టు ప్రాంతాల్లో 24 కాలనీల్లో సుమారు 14 కాలనీలు నీటిలో మునిగాయి. సరూర్ నగర్ చెరువుకు సమీపంలో ఉన్న కోదండరామానగర్, చైతన్యపురి, వివేకానందనగర్ తదిరత కాలనీల్లో లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగాయి.

 ఎల్బీనగర్, హైదర్ నగర్, బడంగేట్ తపోవన్ కాలనీ, వనస్థలిపురంలోని పలు కాలనీలు నీట మునిగాయి.ఉప్పల్ ఏరియాలోని పలు కాలనీలు కూడ నీట మునిగాయి.గత ఏడాదిలో కురిసన భారీ వర్షాల కారణంగా   హైద్రాబాద్ అతలాకుతలమైంది.  ఈ ఏడాది జూలై మాసంలో ఒక్క రోజులో కురిసిన భారీ వర్షాలకు మరోసారి ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. ఇక హయత్‌నగర్ బస్ డిపోలో వర్షపు నీరు చేరింది. వర్షపు నీటిలోనే బస్ డిపో పెట్రోల్ బంకు మునిగిపోయింది. గత ఏడాదిలో కురిసిన వర్షానికి కూడ హయత్ నగర్ బస్ డిపో మునిగిపోయిన విషయం తెలిసిందే.
 

 

click me!