అప్పుడే భారత్ అభివృద్ధి సాధ్యం... హార్వర్డ్ ఇండియా సదస్సులో మంత్రి కేటీఆర్

Siva Kodati |  
Published : Feb 20, 2022, 08:45 PM IST
అప్పుడే భారత్ అభివృద్ధి సాధ్యం... హార్వర్డ్ ఇండియా సదస్సులో మంత్రి కేటీఆర్

సారాంశం

భారతదేశంలో ఉన్న వనరులు, అవకాశాలను సరైన విధంగా ఉపయోగించుకుంటే దేశ పురోగతి ఆపడం ఎవరి తరం కాదన్నారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ (ktr). 2030 నాటికి భారతదేశ అభివృద్ధి అనే అంశంపైన హార్వర్డ్ ఇండియా సదస్సులో ఆయన పాల్గొన్నారు.

భారతదేశంలో ఉన్న వనరులు, అవకాశాలను సరైన విధంగా ఉపయోగించుకుంటే దేశ పురోగతి ఆపడం ఎవరి తరం కాదన్నారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ (ktr). 2030 నాటికి భారతదేశ అభివృద్ధి అనే అంశంపైన హార్వర్డ్ ఇండియా సదస్సులో (harvard india conference 2022) మంత్రి కేటీఆర్ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం అభివృద్ధి మరింత వేగవంతంగా, విప్లవాత్మకంగా ముందుకు పోవాలంటే కొన్ని ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. 

ప్రపంచంలో అతిపెద్ద కాటన్ ఉత్పత్తి చేసే దేశంగా ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్ ,శ్రీలంకల కన్నా తక్కువ దుస్తులను ఎందుకు ఉత్పత్తి చేస్తుంది ? ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ధరలకన్నా భారతదేశంలో తయారుచేసే మెడికల్ డివైసెస్ పరికరాల ధర ఎందుకు ఎక్కువగా ఉంటుంది అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇండియా కన్నా అతి చిన్న దేశాలైన వియత్నాం, తైవాన్ లాంటి దేశాలు తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్నాయన్నారు. భారతదేశంలోని నదుల నిండా నీళ్లు పారుతున్నప్పటికీ ఎండిపోతున్న బీడు భూములు ఎందుకున్నాయి? కరువు పరిస్థితులు ఎందుకు ఉన్నాయన్న ప్రశ్నలకు దేశంలోని ప్రభుత్వాలు, మేధావులు, విద్యావేత్తలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్.

భారతదేశం, చైనాల జిడిపి 35 సంవత్సరాల క్రితం సమానంగా ఉన్నప్పటికీ, ఈ రోజు చైనా మనకన్నా అనేక రంగాల్లో చాలా ముందు వరుసలో ఉన్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. సరైన పరిపాలనా విధానాలు, ప్రాధాన్యతలు, భవిష్యత్తుకి అవసరం అయ్యే విప్లవాత్మకమైన సంస్కరణలు, ప్రపంచస్థాయి అవసరాలకు సిద్ధంగా ఉండేలా మౌలిక వసతుల కల్పన చేయడం వంటి కొన్ని ప్రాథమిక కార్యక్రమాలను చేపడితే దేశం మరింత వేగంగా ముందుకుపోతుందని  కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

దేశంలోనే అతి తక్కువ వయసు కలిగిన నూతన రాష్ట్రమైన తెలంగాణ.. గత ఏడేళ్లలో అనేక కార్యక్రమాల్లో దేశానికి పాఠాలు నేర్పే విధంగా ముందుకుపోతున్నదని కేటీఆర్ గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే తీసుకువచ్చిన టిఎస్ ఐపాస్ మొదలుకొని తర్వాత కాలంలో వచ్చిన టిఎస్‌బి పాస్, నూతన పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాలు, నూతన విధానం ద్వారా ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ వంటి అనేక అద్భుతమైన కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందువరుసలో నిలిపేందుకు దోహదం చేస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. వీటితో పాటు స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం ఆలోచించని స్థాయిలో కాలేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రోడ్ల నిర్మాణం, వ్యవసాయ రంగంలోని మౌలిక వసతుల కల్పన వంటి అంశాల్లో అద్భుతమైన పురోగతి సాధించిందన్నారు. 

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు, టీఎస్ ఐపాస్, పట్టణ ప్రకృతి వనాల వంటి కార్యక్రమాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో సహా అనేక రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకున్నాయని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక , ఐటి, హెల్త్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రోత్సాహం వలన 5 వ్యవసాయ విప్లవాలు తెలంగాణలో పరిఢవిల్లే పరిస్థితి నెలకొందన్నారు.

మానవ వనరులు, థింక్ ఫోర్స్ ని  ఉపయోగించుకొని క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల నిర్మాణంలో భారీగా ఆలోచించినప్పుడే భారతదేశ అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. భారతదేశం నుంచి ప్రపంచం గర్వపడే ఉత్పత్తులు రావాల్సిన అవసరం ఉందని ఈ దిశగా ఇన్నోవేషన్ రంగానికి ప్రోత్సాహం ఇవ్వాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఇన్నోవేషన్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టీ హబ్, వి హబ్, అగ్రి హబ్ వంటి ఇంకుబేటర్లను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

తెలంగాణ ప్రభుత్వ విధానాలను భారతదేశం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లినప్పుడే ప్రపంచ ఆర్థిక శక్తిగా భారతదేశం ఆవిర్భవించే అవకాశం పుష్కలంగా ఉందని కేటీఆర్ ఆకాంక్షించారు. ఒకప్పుడు బెంగాల్ ఆలోచించింది, తరువాత భారతదేశం ఆలోచిస్తున్నదన్న నానుడి ఉండేదని ఈ రోజు తెలంగాణ ఆలోచించింది, చేసింది రేపు భారతదేశం చేస్తున్నదన్న విశ్వాసం తనకు ఉందన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్