Childrens Day Special: తెలంగాణ ఆర్టిసి భలే ఆఫర్... చిన్నారులకు మాత్రమే

By Arun Kumar PFirst Published Nov 14, 2021, 2:31 PM IST
Highlights

జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారుల కోసం తెలంగాణ ఆర్టిసి అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఈ ఒక్కరోజు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణానికి చిన్నారులకు అవకాశం కల్పించింది. 

హైదరాబాద్: తెలంగాణ ఆర్టిసి ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆ సంస్థను బలోపేతం చేయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. ప్రయాణికులను మరింత ఆకట్టుకునేందుకు ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఈ క్రమంలో ఇప్పటికే అనేక నిర్ణయాలతో ప్రయాణికులకు దగ్గరైన ఆర్టిసిని చిన్నారులకు కూడా చేరువ చేసేందుకు జాతీయ బాలల దినోత్సవాన్ని ఉపయోగించుకున్నారు. నవంబర్ 14న చిల్డ్రన్ డే సందర్భంగా టీఎస్ ఆర్టిసి బస్సుల్లో చిన్నారులరకు ఉచిత ప్రయాణి కల్పించారు. 

పదిహేను సంవత్సరాలలోపు బాలబాలికలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన అన్నిరకాల బస్సుల్లో ఈ ఒక్క రోజు(ఆదివారం) ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే TSRTC సిబ్బందికి ఆదేశాలు జారీచేసినట్లు టీఎస్ ఆర్టిసి తెలిపింది. 

ఇక ఇప్పటికే వివాహాల కోసం ఆర్టిసి బస్సులను బుక్ చేసుకుంటే ఆ నూతన జంటకు ఆర్టిసి తరపున జ్ఞాపికను అందజేయాలని ఎండి Sajjanar నిర్ణయించారు. స్వయంగా ఆయనే యాదగిరిగుట్ట డిపో నుంచి రెండు బస్సులను అద్దెకు తీసుకుని కొంపల్లి వేదికగా పెళ్లి చేసుకున్న నూతన జంటను స్వయంగా ఆశీర్వదించిన సజ్జనార్ ఆర్టిసి తరపున కానుకలు ఇచ్చే కార్యక్రమానికి  శ్రీకారం చుట్టారు. పెళ్లికి హాజరైన సజ్జనార్ డ్రైవర్లు ముత్యాల ఆంజనేయులు, పబ్బాటి గణేష్ చేతులమీదుగా నూతనజంటకు జ్ఞాపికను అందజేసారు.  

READ MORE  Allu Arjun : అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పకపోతే, న్యాయపోరాటమే.. ఆర్టీసీఎండీ సజ్జనార్

అలాగే ఆర్టిసి బస్సుల్లోనే ఎక్కువగా ప్రయాణించే జర్నలిస్టులకు కూడా టీఎస్ ఆర్టిసి గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు అక్రిడియేషన్ కలిగిన జర్నలిస్ట్ లు ప్రత్యేక బస్ పాస్ తో  2/3 తగ్గింపుతో ప్రయాణించే వెసులుబాటు వుండేది. అయితే ఇకపై ఈ బస్ పాస్ తో ఆన్లైన్ లోనూ 2/3  తగ్గింపుతో టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని ఆర్టిసి కల్పించింది. ఈ నిర్ణయం పట్ల  జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేస్తూ... తమకోసం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్న ఎండి సజ్జనార్ కు కృతజ్ఞతలు తెలిపారు. 

ఇక ఆర్టిసి ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించేవారు ఎంతటివారయినా వదిలేది లేదని సజ్జనార్ ప్రకటించారు.ఈ క్రమంలోనే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కి ఆయన షాకిచ్చారు. అల్లుఅర్జున్ ఆర్టిసిని కించపర్చేలా చేసిన ఓ పనికి ఏకంగా నోటీసులు జారీ చేసారు. ఆర్టీసీ ప్రతిష్టని కించపరిచేలా వ్యవహరించారనే ఆరోపణలతో బన్నీకి నోటీసులు పంపించారు. అల్లు అర్జున్‌తోపాటు Rapido సంస్థకి కూడా తెలంగాణ స్టేట్‌ రోడ్డు రవాణాసంస్థ నోటిసులు జారీ చేసింది. ర్యాపిడో అనే బైక్‌ టాక్సీ యాప్‌ని ప్రమోట్‌ చేసే క్రమంలో ఆర్టీసీ సర్వీస్‌ని కించపరిచేలా ఈ యాడ్‌ ఉందని తెలంగాణ ఆర్టీసీ భావిస్తూ బన్నీకి నోటీసులు పంపించింది. 

 అల్లు అర్జున్ తక్షణమే ఆర్టీసీకి క్షమాపణ చెప్పాలని ఆ సంస్థ ఎండి సజ్జనర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.  ఇచ్చిన నోటీసులకు రిప్లై రాకపోతే న్యాయపరంగా ముందుకు వెళతామంటూ అల్లు అర్జున్ తో పాటు ర్యాపిడో సంస్థకు సజ్జనార్ హెచ్చరించారు.
 

click me!