బుద్దభవన్‌లో కోదండరామ్ మౌన దీక్ష.. మునుగోడులో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..

By Sumanth KanukulaFirst Published Oct 25, 2022, 12:52 PM IST
Highlights

తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ మౌనదీక్షకు దిగారు. హైదరాబాద్‌లోని బుద్దభవన్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో దీక్ష చేపట్టారు. 

తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ మౌనదీక్షకు దిగారు. హైదరాబాద్‌లోని బుద్దభవన్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో దీక్ష చేపట్టారు. మునుగోడు ఉప ఎన్నికలో డబ్బు, మద్యం పంపిణీ జరుగుతుందని అన్నారు. ఎన్నికల నిబంధనలు పూర్తిగా గాలికొదిలేశారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో అక్రమాలు, ఎన్నికల  కోడ్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. రాజ్యంగ బద్ధంగా మునుగోడు ఉప ఎన్నికను జరిపించాలని కోదండరామ్ కోరారు.ఇక, మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ జనసమితి తరఫున పల్లె వినయ్ కుమార్ బరిలో నిలిచారు. 

ఇక, మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు 12 కేసులు పెట్టామని.. రూ. 2,49,65,960 నగదు స్వాధీనం చేసుకున్నామని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ ఆదివారం తెలిపారు. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది 1,483.67 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. 36 మందిని అరెస్టు చేయడంతో పాటు 77 కేసులు బుక్ చేశారని వెల్లడించారు. 

ఐపీసీ సెక్షన్ 171 బీ ప్రకారం.. ఎన్నికల ప్రక్రియలో ఎవరైనా నగదు లేదా వస్తు రూపంలో ఏదైనా తాయిలాలు ఇవ్వడం లేదా స్వీకరించడం చేస్తే..  ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడుతుందని తెలిపారు. అలాగే ఐపీసీ సెక్షన్ 171 సీ ప్రకారం.. ఎవరైనా అభ్యర్థిని లేదా ఓటర్లను లేదా మరే ఇతర వ్యక్తిని బెదిరించినా, గాయపరిచినా ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడతాయని చెప్పారు. 

మునుగోడు ఉప ఎన్నిక అదనపు పరిశీలకునిగా ఐఆర్‌ఎస్ అధికారి సుబోధ్ సింగ్‌ను, వ్యయ పరిశీలకులుగా సమత ముళ్లపూడి ఈసీ నియమించింది. అయితే నియోజకవర్గంలో అక్రమ నగదు ప్రవాహాన్ని నియంత్రించడానికి ఆదాయపు పన్ను శాఖ మరో ఏడుగురు సిబ్బందిని నామినేట్ చేసింది. ఇక, టోల్ ఫ్రీ నంబర్ (08682230198)తో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడిందని వికాస్ రాజ్ తెలిపారు. 14 మంది సభ్యుల బృందం ఫిర్యాదులను 24 గంటలపాటు పర్యవేక్షిస్తుందని తెలిపారు.

click me!