అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కోదండరామ్ పార్టీ టీజేఎస్ మద్దతు.. హస్తం ముందు 6 షరతులు

By Mahesh K  |  First Published Oct 30, 2023, 4:14 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కోదండరామ్ పార్టీ టీజేఎస్ మద్దతు పలికింది. ఈ విషయాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. కోదండరామ్ మద్దతు కోసం మాణిక్ రావు ఠాక్రే సహా కీలక నేతలు టీజేఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లినట్టు చెప్పారు.
 


హైదరాబాద్: తెలంగాణ రాజకీయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ మద్దతును ప్రకటించింది. టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్‌తో కాంగ్రెస్ నేతలు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఈ రెండు పార్టీలు ఏకతాటి మీదికి వచ్చాయి. ఎన్నికల్లో కలిసి పోరాడి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే అభిప్రాయానికి వచ్చాయి. ప్రొఫెసర్ కోదండరామ్ మద్దతు కోరడానికి కాంగ్రెస్ నేతలు టీజేఎస్ కార్యాలయానికి వెళ్లారు. ఏకైక లక్ష్యంతో పోరడాలని చేసిన విజ్ఞప్తికి టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ సానుకూలంగా స్పందించినట్టు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.

తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలకు కోదండరామ్ మీద సంపూర్ణ విశ్వాసం ఉణ్నదని, తెలంగాణలో గడీల పాలన పోయి ప్రజా పాలన తెచ్చే ఏకైక లక్ష్యం కోసం కలిసి పోరాడాలని మాణిక్ రావు సహా కాంగ్రెస్ రాష్ట్ర నేతలు కోదండరామ్‌ను కోరారు. ఈ ప్రతిపాదనకు ప్రొఫెసర్ కోదండరామ్ సానుకూలంగా స్పందించినట్టు కాంగ్రెస్ తెలిపింది. ఎన్నికల విషయంలో తమకు ఉన్న సంశయాలు, అభిప్రాయాలు, ఆలోచనలను కాంగ్రెస్ నేతలతో చర్చించామని టీజేఎస్ చీఫ్ కోదండరామ్ చెప్పారు. ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడానికి సహకరించాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసిందని, కోదండరామ్ అనుభవాన్ని కేసీఆర్‌ను ఓడించడానికి ఉపయోగించాలనే విజ్ఞప్తిని స్వాగతిస్తున్నట్టు టీజేఎస్ నేతలు వివరించారు.

Latest Videos

Also Read: కాంగ్రెస్ ఫిర్యాదుతోనే నిలిచిన రైతు బంధు నిధులు: జుక్కల్ సభలో కేసీఆర్

ప్రజా పరిపాలనా, ఉద్యమ కాంక్షలను నెరవేర్చేలా కలిసి సాగుతామని టీజేఎస్ పేర్కొంది. కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడానికి టీజేఎస్ ఆరు షరతులు పెట్టింది. అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగాలు కల్పించాలనే ప్రతిపాదన తెచ్చింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు న్యాయం చేయాలని, సంప్రదాయ వృత్తుల వారికీ, చిన్న సన్నకారు రైతులకు ఆదాయ భద్రత కల్పించాలని కోరారు. రాజ్యాంగ విలువలతో అన్ని వర్గాల అభివృద్ధి జరగాలని, ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ముందు కోదండరామ్ ప్రతిపాదనలు పెట్టారు. అయితే, ఈ ప్రతిపాదనలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంగీకరించారు. కాంగ్రెస్ తమ ఆరు ప్రతిపాదనలను అంగీకరించినట్టు కోదండరామ్ వెల్లడించారు.

click me!