Munugode ByPoll : బీసీయే అభ్యర్ధిగా వుండాలి, కొత్త వాళ్లకి టికెట్ వద్దు... కాంగ్రెస్‌లో తెరపైకి కొత్త డిమాండ్

By Siva KodatiFirst Published Aug 11, 2022, 4:26 PM IST
Highlights

మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీలో కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. కొత్తగా కాంగ్రెస్‌లోకి వచ్చిన వారికి టికెట్ ఇవ్వొద్దని కొందరు సూచిస్తున్నారు. 
 

మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్‌లో కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. పార్టీ టికెట్ బీసీ అభ్యర్ధికే ఇవ్వాలని మధుయాష్కీ డిమాండ్ చేశారు. పార్టీలో కొత్తగా చేరిన వారికి టికెట్ ఇవ్వొద్దన్న ఆయన అలా చేస్తే పాత వారితో సమస్యలు వస్తాయన్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కూడా మునుగోడు ఉపఎన్నికపై దృష్టి సారించిందని మధుయాష్కీ తెలిపారు. ఈ ఎన్నికను చాలా సీరియ‌స్‌గా తీసుకొవాల్సిందిగా రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారని ఆయన వెల్లడించారు. 

బీజేపీ, టీఆర్ఎస్‌లు వందల కోట్లు ఖర్చు పెట్టబోతున్నాయని.. కాంగ్రెస్ పార్టీ ఆర్ధిక పరిస్ధితుల దృష్ట్యా ఆ స్థాయిలో ఖర్చు పెట్టలేదని మధుయాష్కీ తెలిపారు. కేవలం డబ్బుతోనే ప్రతి ఎన్నికల్లో గెలవడం కుదరదన్న ఆయన.. పార్టీ ప్రజల వద్దకే వెళ్లాలని నిర్ణయించిందన్నారు. ఎన్నిక ఎందుకు వచ్చింది.. కాంగ్రెస్ ఏం చేయగలదు, తెలంగాణకు ఏం చేసిందనే దానిని ప్రజలకు వివరిస్తామని మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణను ఏర్పాటు చేసిన పార్టీయే .. ఇప్పుడున్న పరిస్ధితుల్లో రాష్ట్రాన్ని కాపాడుకోగలదని ఆయన వెల్లడించారు. 

Also Read:Munugode Bypoll 2022: మునుగోడుపై వేగం పెంచిన కాంగ్రెస్.. ఈ నెల 13 నుంచి నియోజకవర్గంలో పాదయాత్ర..

టీఆర్ఎస్, బీజేపీ కుట్రలో భాగంగానే ఉపఎన్నిక వచ్చిందని మధుయాష్కీ ఆరోపించారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లిరాగానే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని దుయ్యబట్టారు. ఇది కాంగ్రెస్‌ను దెబ్బతీసే కుట్రేనని మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. మునుగోడులో బీసీకి టికెట్ ఇవ్వాలని ఆయన కోరారు. కోమటిరెడ్డి వెంకట రెడ్డితో అధిష్టానం మాట్లాడుతోందని మధుయాష్కీ గౌడ్ తెలిపారు. 

ఇకపోతే.. మునుగోడు‌పై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్.. విజయమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే చండూరులో సభ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ.. ఈ నెల 13 నుంచి మునుగోడులో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. సంస్థాన్ నారాయణపురం నుంచి చౌటుప్పల్ వరకు పాదయాత్రను నిర్వహించనున్నారు. ఈ పాదయాత్రలో టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, సీనియర్ నేత మధుయాష్కి పాల్గొననున్నారు. ఈ నెల 16న రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొననున్నారు. ఇక, ఆగస్టు 20న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో జెండా వందనం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అలాగే అమిత్ షాతో బీజేపీ సభ నిర్వహించే రోజు.. గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలుపాలని ఆలోచనలు చేస్తోంది. 

click me!