
Three-year-old boy attacked by stray dogs: మూడేళ్ల బాలుడు ఫంక్షన్ హాల్ బయట ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడి అరుపులు విని అక్కడున్న వారు కుక్కలను తరిమేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, బాలుడి కడుపు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. తెలంగాణలో కుక్కల బెడద, దాడుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫంక్షన్ హాల్ బయట ఆడుకుంటుండగా మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ముదెల్లి గ్రామంలో ఈ కుక్కల దాడి ఘటన చోటుచేసుకుంది. ఫంక్షన్ హాల్ బయట ఆడుకుంటున్న మైనర్ బాలుడిపై కుక్కలు దాడి చేశాయి.
బాలుడు ఆడుకుంటుండగా ఒక్కసారిగా అటుగా వచ్చిన కుక్కల గుంపు దాడి చేయడంతో బాలుడికి కడుపు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాలుడి అరుపులు విన్న స్థానికులు అతడిని రక్షించేందుకు పరుగులు తీశారు. కుక్కలను తరిమికొట్టి ఆ చిన్నారిని రక్షించారు. గాయపడిన బాలుడిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కాగా, గతవారం మేడ్చల్ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. పదేళ్ల బాలుడిపై వీధి కుక్కల గుంపు దాడి చేసింది. అదృష్టవశాత్తూ కుక్కదాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. సూరారం పరిధిలోని శ్రీరామ్‌నగర్‌లో ఓ బాలుడిపై కుక్కల గుంపు దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీడియో ఫుటేజీలో, బాలుడు సాయి చరిత్ (10 సంవత్సరాలు) తన ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించాడు. అయితే, అటుగా ఒక వీధి కుక్కల గుంపు వచ్చింది. అకస్మాత్తుగా అందులోంచి ఒక కుక్క బాలుడి వైపు పరుగెత్తి అతనిపై దాడి చేసింది. బాలుడిపై క్రూరంగా దాడికి దిగిన కుక్కతో పోరాడాడు. అదృష్టవశాత్తూ బాలుడు ఆ స్థలం నుండి తప్పించుకోగలిగాడు. ఇంట్లోకి పరుగెత్తడంతో గాయాలతో తప్పించుకోగలిగాడు.
అలాగే, మే 23న హైదరాబాద్ లో ఓ డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఓ కస్టమర్ కుక్క నుంచి తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో అపార్ట్ మెంట్ మూడో అంతస్తు నుంచి దూకాడు. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 30 ఏళ్ల డెలివరీ ఎగ్జిక్యూటివ్ మహ్మద్ ఇలియాస్ ఓ కస్టమర్ కు పరుపు డెలివరీ చేయడానికి మణికొండలోని పంచవటి కాలనీ ఉన్న శ్రీనిధి హైట్స్ అపార్ట్ మెంట్ లో మూడో అంతస్తుకు వెళ్లాడు. అయితే కస్టమర్ ఫ్లాట్ దగ్గరికి వెళ్లాడు. అక్కడ పాక్షికంగా తెరిచి ఉన్న డోర్ వద్ద కుక్క మొరగడం ప్రారంభించింది. కొంత సమయం తరువాత ఆ డాబర్ మన్ అతడిపైకి వచ్చింది. దీంతో కుక్క నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఇలియాస్ ప్రహరీ గోడపైకి ఎక్కి కిందకి దూకాడు.