మొయినాబాద్ ఫార్మ్ హౌస్ కేసు నిందితుడు నందకుమార్ పై మరో మూడు కేసులు నమోదయ్యాయి. తెరమీదికి హీరో రానా ప్లాట్ వ్యవహారం కూడా వచ్చింది.
హైదరాబాద్ : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నందకుమార్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మరో మూడు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఫిలింనగర్ రోడ్ నెంబర్ వన్ లోని ప్లాట్ నెంబర్ 2లో సినీ హీరో దగ్గుబాటి రానా ఫ్లాట్ ను నందు లీజుకు తీసుకుని జిహెచ్ఎంసి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టి అద్దెకు ఇచ్చాడు. అయితే, చట్టపరమైన హక్కులు లేకుండా ఈ ఫ్లాట్ లో నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు గత ఆదివారం కూల్చివేశారు. ఇక్కడ ఐస్ క్రీం పార్లర్ ఏర్పాటు కోసం రూ. 8 లక్షలు అడ్వాన్స్ గా చెల్లించానని, రూ.40 లక్షలతో మరమ్మతులు, ఇంటీరియర్ చేయించుకున్నానని, ఇప్పుడు ఈ కట్టడాన్నిఅధికారులు కూల్చివేశారని, డబ్బులు వసూలు చేసి మోసగించిన నందుపై చర్యలు తీసుకోవాలని సంజయ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అలాగే బాంబే గార్మెంట్ స్టోర్ పేరుతో తనకు ఓ అక్రమ కట్టడాన్ని అంటగట్టి పెద్దఎత్తున అడ్వాన్స్ తీసుకున్నాడని ఇంటీరియర్ కోసం తాను లక్షలాది రూపాయలు ఖర్చు చేశానని మియాపూర్ కు చెందిన ఇందిరా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫ్లాట్లో అక్రమంగా నిర్మించిన ఓ షాపును బరిస్టా స్టోర్ పేరుతో తాను ఏర్పాటు చేశానని.. ఇది అక్రమ నిర్మాణం కావడంతో అధికారులు కూల్చివేతకు ప్రయత్నం చేయడమే కాకుండా నోటీసులు జారీ చేశారని.. తనను మోసగించిన నందుపై చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్ కు చెందిన అశిజ్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు నందుపై ఐపీసీ సెక్షన్ 406, 420, 506 కింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఆరు రోజుల క్రితం డెక్కన్ కిచెన్ హోటల్ యజమాని సయ్యద్ అయాజ్, మొబైల్ యాక్సెసరీస్ గాడ్జెట్ స్టూడియో యజమాని సందీప్ కుమార్ కూడా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా నందుపై పోలీసులు ఐదు చీటింగ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.