ఆదిలాబాద్ లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

By team telugu  |  First Published Dec 25, 2021, 9:51 AM IST

ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ఘటనా స్థలంలోనే చనిపోగా.. మరొకరు చికిత్స పొందుతూ చనిపోయారు. 


ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు యువ‌కులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా.. మ‌రో యువ‌కుడు చికిత్స పొందుతూ ప‌రిస్థితి విషమించి మృతి చెందారు. ఈ ప్ర‌మాదం శ‌నివారం తెల్ల‌వారుజామున ఉట్నూర్ స‌మీపంలో చోటు చేసుకుంది. త‌డిహ‌త్నూర్‌కు చెందిన ఇద్ద‌రు యువ‌కులు, పెరికగూడ‌కు చెందిన మ‌రో యువ‌కుడు ముగ్గురు ఒకే బైక్ పై వెళ్తున్నారు. కుమ్మ‌రితండా వ‌ద్ద‌కు చేరుకునేస‌రికి ఎదురుగా వ‌చ్చిన మ‌రో బైక్‌ను ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో త‌డిహ‌త్నూర్‌కు చెందిన ఇద్ద‌రు యువ‌కులు ఘ‌ట‌నా స్థ‌లంలోనే మృతి చెందారు. గాయ‌ప‌డిన వారిని చికిత్స కోసం రిమ్స్ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. అందులో పెరిక‌గూడ‌కు చెందిన యువ‌కుడు రిమ్స్‌లో చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించి మృతి చెందాడు. 

చావులోనూ వెంటే.. భార్య మరణించిన గంట వ్యవధిలోనే భర్త కూడా..

Latest Videos

undefined

పెరుగుతున్న రోడ్డు ప్ర‌మాదాలు..
రోడ్డు ప్ర‌మాదాలు పెరుగుతున్నాయి. ఇటీవ‌ల కాలంలో వివిధ కార‌ణాల వ‌ల్ల యాక్సిడెంట్స్ జ‌రుగుతున్నాయి. శుక్ర‌వారం యాదాద్రి జిల్లాలో కూడా ఇలాంటి ప్ర‌మాద‌మే జ‌రిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం జమ్మాపురంలో ఈ దుర్ఘటన జరిగింది. జమ్మాపురం స్టేజీ వద్ద ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి హఠాత్తుగా రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో నవతా ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన లారీ వెనుక నుంచి వస్తున్నది. బైక్ నడుపుతున్న డ్రైవర్ ఒక్కసారిగా కిందపడిపోవడాన్ని లారీ డ్రైవర్ చూశాడు. అంతే వేగంగా బ్రేకులు వేశాడు. లారీ కంట్రోల్‌లోకి వచ్చింది. బైక్ పైకి వెళ్లేలోపలే అది ఆగిపోయింది. కానీ, ఆ నవతా లారీ  వెనుకే ఓ బస్సు కూడా వస్తున్నది. ఆ బస్సు డ్రైవర్‌కు లారీ ముందు జరుగుతున్న పరిణామం తెలియదు. ఒక్కసారిగా లారీ సడన్ బ్రేక్ వేయడంతో దాని వెనుకే వస్తున్న బస్సు లారీని ఢీకొంది. లారీ వెనుకను బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 65 మంది ప్రయాణికులు ఉన్నారు. లారీని ఢీ కొన్నందున అందులో 15 మందికి గాయాలయ్యాయి. మహిళా కండక్టర్‌కు ఏకంగా చేయి విరిగింది. క్షతగాత్రులను వెంటనే బీబీనగర్ ఎయిమ్స్, జిల్లా కేంద్ర ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ఇప్పుడు వీరంతా హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. 

ఇద్దరు కొడుకులను చంపేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి

అలాగే బుధ‌వారం రోజు  వరంగల్ చల్వాయి గోవిందరావు పేట గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ల బయ్యారం మండలం పోతిరెడ్డి పల్లితో పాటు ఇరుగుపొరుగు గ్రామాలకు చెందిన రైతులు తమ పంటను అమ్ముకోవాలని నిర్ణయించుకున్నారు. వారంతా వరంగల్ ఎనుమాముల మార్కెట్‌ చేరుకున్నారు. పత్తి, మిర్చి అమ్ముకున్నారు. వ్యాన్‌లో స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అయ్యారు. కాగా, చల్వాయ్ దగ్గర ఓ లారీ లోడ్ చేస్తున్నారు. వడ్ల బస్తాలను ఆ లారీలో ఎక్కిస్తున్నారు. రైతులతో వెళ్తున్న వ్యాన్ ఆ లారీని బలంగా ఢీ కొట్టింది. దీంతో వ్యాన్ ముందు భాగం నుజ్జు నుజ్జయింది. వారం రోజు నిర్మ‌ల్ లో ఆర్టీసీ బ‌స్సు అదుపుత‌ప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న ఆద‌ర్శ‌న‌గ‌ర్ వ‌ద్ద చోటు చేసుకుంది. నిర్మ‌ల్ డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సు కామ‌ల్ కోట నుంచి నిర్మ‌ల్ బ‌స్ స్టాండ్ కు వ‌స్తోంది. ఆద‌ర్శ్‌న‌గ‌ర్ వ‌ద్ద‌కు చేరుకునేస‌రికి అదుపు త‌ప్పి పొలాల్లోకి వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు బ‌స్సులో 60 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. అదృష్టం కొద్దీ వారంతా స్వ‌ల్ప‌గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. 
 

click me!