
హైదరాబాద్ : తెలంగాణలో రానున్న మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదముంది కాబట్టి అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. ముఖ్యంగా వ్యవసాయ పనులకోసం పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు జాగ్రత్తగా వుండాలని అధికారులు సూచించారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, వరంగల్, నారాయణపేట్, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వర్షాలకు ఈదురుగాలులు కూడా తోడు కానున్నాయని... గరిష్టంగా గంటకు 60 వేగంతో గాలులు వీయవచ్చని తెలిపారు. అలాగే అక్కడక్కడా పిడుగులు పడే అవకాశాలున్నాయనిహెచ్చరించారు.
Read More cyclonic storm: తుఫాను ముప్పు.. బంగాళాఖాతంలోకి వెళ్లవద్దంటూ ఐఎండీ హెచ్చరికలు
ఇప్పటికే అకాల వర్షాలతో చేతికందివచ్చిన పంటలు దెబ్బతిని అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. పొలాల్లో, కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల వద్ద... ఇలా ఒకదగ్గర వర్షం నుండి ధాన్యాన్ని కాపాడుకుంటే మరోదగ్గర తడిపేసింది. దీంతో రైతులకు భరోసా కల్నిస్తూ ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అంతేకాదు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు ప్రజాప్రతినిధులంతా నష్టపోయిన రైతులకు భరోసా ఇస్తూ క్షేత్రస్థాయిలోనే వుండాలని సూచించారు. ఎవరి నియోజకవర్గాల్లో వారు వర్షాలు, పంటనష్టం పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.