
హైదరాబాద్: మత మౌఢ్యం ముప్పు తెచ్చిపడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఏ మతం తప్పులు చేయమని చెప్పదని తెలిపారు. కోకాపేట, నార్సింగి మధ్య ఉన్న గోష్పాద క్షేత్రంలో హరేకృష్ణ హెరిటేజ్ టవర్‌కు సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మనిషి ఏదైనా విజయం సాధిస్తే తన ప్రతిభగా చెప్పుకుంటాడని అన్నారు. అదే విపత్తు వస్తే దేవుడిపై నెపం వేస్తాడని చెప్పారు. మతం మౌఢ్యం మంచిని పిచ్చిలోకి తీసుకెళ్లి అమానుషమైన పనులు చేయిస్తుందని చెప్పారు. ఏ మతంలో హింసకు తావులేదని అన్నారు.
మతాన్ని మౌఢ్యంలో పెట్టి మధ్యలో వచ్చినవాళ్లు చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారని మండిపడ్డారు. మధ్యలో వచ్చిన కొంతమంది మతాలను వక్రమార్గం పట్టించారని అన్నారు. అదే సమయంలో హరేకృష్ణ ఫౌండేషన్‌పై కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. కరోనా సమయంలో హరేకృష్ణ ఫౌండేషన్ ఎన్నో సేవలు అందించిందని కొనియాడారు. అన్ని ఆపద సమయాల్లో ప్రజలకు అండగా నిలిచిందని చెప్పారు.
మతం పేరుతో చెలరేగే కొన్ని దుష్పరిణామాలను నివారించడానికి హరేకృష్ణ సంస్థ వారి వంతు ప్రయత్నం చేయాలని కోరారు. మతాన్ని హృదయపూర్వకంగా నమ్మేవారు, భక్తిభావంతో ఉండేవారు.. మత మౌఢ్యాన్ని కోరుకున్న దాఖలాలు లేవని చెప్పారు. ఏ యాగం చేసినా విశ్వ శాంతిని కోరుకుని చేస్తామని తెలిపారు.