ఈ ఆదివారం హైదరాబాద్ లో నో నాన్ వెజ్ ... ఎందుకో తెలుసా..?

By Arun Kumar PFirst Published Apr 18, 2024, 8:36 AM IST
Highlights

ఈ ఆదివారం హైదరాబాద్ లో మాంసం విక్రయాలపై నిషేదం విధించారు. మహవీర్ జయంతిని పురస్కరించుకుని గ్రేటర్ హైదరాబాద్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలు మంచి నాన్ వెజ్ ప్రియులన్న విషయం అందరికీ తెలిసిందే. పండగైనా, శుభకార్యమైనా మెనూలో నాన్ వెజ్ వంటకాలు వుండాల్సిందే. ఇక ఆదివారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు...  ఆ రోజు ఇంట్లో పక్కా నాన్ వెజ్ వండాల్సిందే. మరీ ముఖ్యంగా ఈ  ఉరుకుల పరుగుల ఉద్యోగ, వ్యాపార జీవితాన్ని సాగించే హైదరాబాదీలకు ఆదివారమే కాస్త సమయం దొరికేది. అందువల్లే ఆ రోజు భార్యాపిల్లలతో కలిసి ఇష్టమైన మాంసాహారం తినేందుకు ఇష్టపడతారు... కాబట్టి మాంసం దుకాణాలు కిక్కిరిసి వుంటాయి. అయితే ఈ ఆదివారం (ఏప్రిల్ 21)న హైదరాబాద్ లో మాంసం దొరికే పరిస్థితి లేదు. స్వయంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులే ఆదివారం మాంసం విక్రయాలపై నిషేదం విధించారు. ఇది నాన్ వెజ్ ప్రియులకు నిరాశ కలిగించే నిర్ణయమని చెప్పాలి. 

సరిగ్గా ఆదివారమే ఎందుకు..? 

ఈ ఆదివారం జైనుల ఆరాధ్యదైవం, 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడి జయంతి. తెలుగు నెలల ప్రకారం ప్రతి ఏడాది చైత్రమాసంలో మహవీర్ జయంతి జరుగుతుంది. ఇలా ఈ ఏడాది మహవీర్ జయంతి ఆదివారం వచ్చింది.

తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ జైనులు అధికంగా వున్నారు. వాళ్ళంతా మహావీరుడి ఆరాధిస్తూ అహింసా బోధనలను విశ్వసిస్తారు. ఏ ప్రాణికి హాని తలపెట్టకూడదనే అహింస సిద్దాంతం జైనమత బోధనల్లో ప్రధానమైనది. కాబట్టి జైనుల ఆచారాలను గౌరవిస్తూ హైదరాబాద్ లో వచ్చే ఆదివారం మాంసం విక్రయాలను నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

మాంసం వ్యాపారులపై తీవ్ర ప్రభావం : 

మాంసం విక్రయాల్లో తెలంగాణ రాష్ట్రమంతా ఒక ఎత్తయితే కేవలం హైదరాబాద్ నగరం మరో ఎత్తు.   తెలంగాణ ప్రజలే కాదు వివిధ రాష్ట్రాల ప్రజల నివాసముండే కాస్మోపాలిటిన్ నగరం హైదరాబాద్. కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా కంటే హైదరాబాద్ లోనే మాంసం విక్రయాలు అధికం. ఇక ఆదివారం అయితే చికెన్, మటన్ షాపుల ముందు క్యూలు కనిపిస్తాయి. అలాంటిది ఈ ఆదివారం మాంసం విక్రయాలు నిలిపివేయడంతో వినియోగదారులకే కాదు వ్యాపారులపైనా ప్రభావం చూపించనుంది. 

ఆదివారం మాంసం షాపులను మూసివేయాలన్న  నిర్ణయం యజమానులకు నష్టాన్ని కలిగించనుంది. కానీ మతసామరస్యానికి నిలయమైన హైదరాబాద్ లో జైనుల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాటించేందుకు కబేళాలు, మాంసం షాపుల నిర్వహకులు పాటించనున్నారు. ఎవరైనా తమ ఆదేశాలను కాదని మాంసం విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిహెచ్ఎంసీ హెచ్చరించింది. సోమవారం యధావిధిగా మాంసం విక్రయాలు జరుపుకోవచ్చని జిహెచ్ఎంసి కమీషనర్ రొనాల్డ్ రాస్ పేరిట ఆదేశాలు జారీ అయ్యాయి. 
 

click me!