కేసీఆర్ కల్యాణ లక్ష్మి తీసుకురావడానికి ఆ ఘటనే కారణం.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

By SumaBala BukkaFirst Published Dec 22, 2022, 1:02 PM IST
Highlights

నిజామాబాద్ లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ది దారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెక్కులు పంపిణీ చేశారు. ఆ తరువాత ఆమె మాట్లాడుతూ ఆ ఘటన వల్లే కేసీఆర్ ఇలాంటి పథకానికి రూపకల్పన చేశారని చెప్పారు. 

బోధన్ : రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆలోచనకు వరంగల్ జిల్లాలో జరిగిన ఓ ఘటనే కారణమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సహృదయత వల్లే ఈ పథకాలకు రూపకల్పన జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా ప్రజల ప్రయోజనాలు మాత్రమే దృష్టిలో పెట్టుకుంటారని.. రాజకీయాలను పట్టించుకోరని ఆమె చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లా బోధన్ లో షాదీ ముబారక్,  కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున అందించాల్సిన ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ మేరకు చెప్పుకొచ్చారు.

‘ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచే రూపాయి రూపాయి కూడబెట్టి పిల్ల పెళ్లి కోసం దాచిపెట్టే కుటుంబాలు మన రాష్ట్రంలో,  దేశంలో ఎన్నో ఉన్నాయి. తగిన  కట్నాలు ఇవ్వలేక,  పెళ్లిళ్లు చేయలేక పోయే కుటుంబాలు కూడా అనేకం కనిపిస్తాయి.  అందుకే అటువంటి కుటుంబాలకు.. చన్నీళ్ళకు,  వడి నీళ్లతోడు అన్నట్లు..కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లు పనికి వస్తున్నాయి. మన ఇంట్లో జరిగే శుభకార్యానికి..  ప్రభుత్వం తరఫున దొరికే ఆశీర్వాదం ఇది. దాని కోసమే కేసీఆర్ ఈ కార్యక్రమాలను చేపట్టారని  చెప్పారు. 

బంజారాహిల్స్‌లో భారీ చోరీ.. రూ. కోటి విలువైన వజ్రాలు, బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు..

అసలు దీనికి ఎలా బీజం పడింది.. అని మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు ఓ తండాలో ఓ వ్యక్తి కేసీఆర్ దగ్గరకు వచ్చాడు. తమ తండాలో జరిగిన అగ్ని ప్రమాదంలో బిడ్డ పెళ్లి కోసం దాచిపెట్టిన డబ్బులు కాలిపోయాయి అని చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో అప్పటికప్పుడు కెసిఆర్ 50 వేల రూపాయలు సేకరించి.. అతనికి సహాయం చేశారు.  తెలంగాణవచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కులమతాలకు అతీతంగా ఇలాంటి పేద వారికి సహాయ పడాలని దానికోసం.. ఏదైనా చేయాలని ఆయన అప్పుడే నిర్ణయించుకున్నారు.

అలా రూపొందిన కార్యక్రమమే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. రూ.50 వేల రూపాయల ఆర్థిక సహాయంతో ప్రారంభమైన కార్యక్రమం ఇప్పుడు రూ.లక్షకు పెరిగింది. లబ్ధిదారుల కుటుంబాలకు ఇది ఎంతో కొంత ఆసరా అవుతోంది. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కార్యక్రమం లేదు. దేశంలో ఎక్కడా లేని ఇలాంటి కార్యక్రమం మన రాష్ట్రంలోనే అమలవుతోంది.. ఎందుకు అనేది ప్రజలు ఆలోచించుకోవాలి  అన్నారు.

బిఆర్ఎస్ కు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి మంచి స్పందన వస్తోంది. అన్ని రాష్ట్రం నుంచి బిఆర్ఎస్ లో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఎంతోమంది మేం చేరతామని కోరుతున్నారు.  తెలంగాణ భూమి పుత్రుడైన కెసిఆర్ బిఆర్ఎస్ తో దేశవ్యాప్తంగా విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి... అని ఆమె అన్నారు. ప్రజల ఆశీర్వాదం దీనికి కారణం అని దీన్ని అలాగే కొనసాగించాలని ఆశిస్తున్నానని కవిత అన్నారు. 

click me!