
చెట్లు పెంచాలని పదే పదే సిఎం కేసిఆర్ జనాలను కోరుతున్నారు. ఏ చిన్న మీటింగ్ అయినా, ఏ వర్గం వారు కేసిఆర్ ను కలిసినా ఆయన ఒకే ఒక్క కోరిక కోరుతున్నారు. అదేమంటే మీరు చెట్లు పెంచుతానని నాకు హామీ ఇవ్వండి అని కోరుతున్నారు.
తాజాగా నల్లగొండకు చెందిన మదర్ డైరీ పాల ఉత్పత్తిదారులు సిఎం కేసిఆర్ తో ప్రగతిభవన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇంకో అడుగు ముందుకేసి సిఎం గట్టి ప్రకటనే చేశారు. ‘‘మీ కోరికలు ఏంటియో నాకు చెప్పిర్రు.. నేను తీర్చుతాను. మీకు కూడా విజయ డైరీ రైతుల మాదిరిగానే పాలకు ప్రోత్సాహక ధర 4రూపాయలు లీటరకు పెంచుత. వారం రోజుల తర్వాత అది అమలైతది అన్నారు. దసరా కంటే ముందే అమలు చేపిస్త. కరెక్టుగా చెప్పాలంటే 24 తారీఖ నుంచి మీకు ప్రోత్సాహక ధర అంది తీర్తది ’’ అని కేసిఆర్ అన్నారు.
‘‘మరి నా కోరిక కూడా ఒకటుంది. అది మీరు తీర్చాలి.. తీర్చకపోతే నామీద ఒట్టే. అదేం పెద్ద కష్టం కాదు. ఇక్కడికొచ్చినోళ్లంతా ఇంటికి ఆరు చెట్లు పెంచాలె గంతే. అయినా చెట్లు పెంచితే ఓలకు లాభం 45, 46 టెంపరేచర్ ఉంటున్నది. ముందు ముందు జనాలు బతకాల్నా వద్దా? కాబట్టి మీరంతా చెట్లు పెంచుతానని నాకు మాట ఇచ్చినట్లే కదా?’’ అని కేసిఆర్ వారిని ప్రశ్నించారు.
ఇక చెట్లు పెంచకపోతే ఏం శిక్ష వేస్తానన్నది కూడా చెప్పిండు కేసిఆర్... ‘‘మీరు చెట్లు పెంచకపోతే మటుకు నేను నా పటాలమంతా ఏసుకుని మీ ఇంటికి భోజనానికి వస్తా.. మాకు భోజనం పెట్టాలంటే మీ ఏడాది గాసం ఖతమైది జాగ్రత్త’’ అని సదరాగానే హెచ్చరించారు ముఖ్యమంత్రి కేసిఆర్.
మొత్తానికి తన కోరికను నెరవేర్చేందుకు కేసిఆర్ మాటతీరు మాత్రం అందరినీ ఆకట్టుకుందనే చెప్పాలి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి