ముగిసిన రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్.. తెలుగు రాష్ట్రాల్లో ఓటు వేయని ఎమ్మెల్యేలు వీరే..

Published : Jul 18, 2022, 05:52 PM IST
ముగిసిన రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్.. తెలుగు రాష్ట్రాల్లో ఓటు వేయని ఎమ్మెల్యేలు వీరే..

సారాంశం

రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకోలేదు.   

రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. పార్లమెంట్‌ హౌస్‌తో పాటు, రాష్ట్రాల్లోని శాసనసభ‌లలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు, వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు.. పార్లమెంట్ హౌస్‌లో ఓటు హక్కు వినిగియోగించుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీల్ చైర్‌లో వచ్చి ఓటు వేశారు. ఇక, రాష్ట్రాల శాసనసభలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

ఓటింగ్ ముగియడంతో రాష్ట్రాల అసెంబ్లీల నుంచి బ్యాలెట్ బాక్స్‌లను ఢిల్లీకి తరలించనున్నారు. ఈ నెల 21న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచిన సంగతి  తెలిసిందే.  అయితే ఇప్పటివరకు పార్టీల మద్దతు సమీకరణాలను పరిశీలిస్తే.. ద్రౌపది ముర్ముకు విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

ఇక, తెలుగు రాష్ట్రాలకు విషయానికి వస్తే.. తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు.. విపక్లాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపాయి. రాష్ట్రంలోని ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్డీయే అభ్యర్థిగా మద్దతుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మొత్తం.. 118 ఓట్లు పోల్ అయ్యాయి. మంత్రి కేటీఆర్ ఇక్కడ తొలి ఓటు వేశారు. మొత్తం పోలైన ఓట్లలో.. 117 తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలవి కాగా, మరోకటి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డికి చెందినది. తెలంగాణ శాసనసభలో ఓటు హక్కును వినియోగించుకుంటానని.. మహీధర్ రెడ్డి చేసిన అభ్యర్థను ఎన్నికల సంఘం ఆమోదించింది. ఇదే విషయాన్ని తెలంగాణ శాసనసభ సెక్రటేరియట్‌కు ఈసీ తెలియజేసింది. 

అయితే తెలంగాణలో మొత్తం 119 ఎమ్మెల్యేలు ఉండగా.. ఇద్దరు ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఓటు హక్కును వినియోగించుకోనివారిలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌లు ఉన్నారు. అయితే ఇందులో గంగుల కమలాకర్‌కు ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో ఆయన ఓటు వేసేందుకు రాలేదు. అయితే చెన్నమనేని రమేష్‌ ఓటు వేసేందుకు దూరంగా ఉండటానికి గల కారణం మాత్రం తెలియరాలేదు. 

మరోవైపు ములుగు ఎమ్మెల్యే సీతక్క ఓటు విషయంలో కాసింత హైడ్రామా చోటుచేసుకుంది. ఆమె బ్యాలెట్ పేపర్‌లో పోరపాటున ఎన్డీయే అభ్యర్థికి ఓటువేశారనే ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను సీతక్క ఖండించారు. తాను తమ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థికే ఓటు వేసినట్టుగా చెప్పారు. అయితే బ్యాలెట్ పేపర్‌ పైభాగంలో పెన్ ఇంక్ పడిందని.. అభ్యర్థుల పేర్ల వద్ద కాదని చెప్పారు. అందువల్లే మరో బ్యాలెట్ పేపర్ కోసం అడిగానని.. కానీ అక్కడి అధికారులు ఇవ్వలేదని చెప్పారు. తమ పార్టీ నిర్ణయించిన అభ్యర్థికే ఓటు వేశానని చెప్పారు. తనపై దుష్ప్రచారం చేయడం తగదని అన్నారు. 

ఇక, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వేర్వురుగా మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మొత్తం 172 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం జగన్ తొలి ఓటు వేశారు. ఇక్కడ అధికార వైసీపీ చెందిన 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో మొత్తం 174 ఓట్లు పోల్ అవ్వాల్సి ఉండగా..  టీడీపీ చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకోలేదు. 

టీడీపీ ఎమ్మెల్యేలు నందమూరి బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి విదేశాల్లో ఉండటం వల్ల రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుకోలేకపోయారని తెలిసింది. ఇక, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి పీపీఈ కిట్‌లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం.

ఇక, రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఎన్నుకుంటారనే సంగతి తెలిసిందే. ఇందులో పార్లమెంటు ఉభయ సభలు, అన్ని రాష్ట్రాల శాసనసభల సభ్యులు.. అలాగే ఢిల్లీ, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికైన సభ్యులు ఉంటారు.రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేల ఓటు విలువ వేర్వేరుగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంపీలకు ఆకుపచ్చ, ఎమ్మెల్యేలకు పింక్ బ్యాలెట్‌ పేపర్లను ఈసీ అందుబాటులో ఉంచింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే