
హైదరాబాద్ వైభవాన్ని చాటిచెప్పే పురాతన కట్టడం గోల్కొండ కోటలో ఆదివారం దోపిడీ దొంగలు వీరంగం సృష్టించారు. ఈ కోట పరిధిలోని ఓ హిందూ దేవాలయంలో(అమ్మవారి గుడి) హుండీలను ఎత్తుకెళ్లేందుకు దుండగులు విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యారు. అయితే మరుసటి రోజు ఆలయ పూజారి ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ చోరి ప్రయత్నం గురించి బయటపడింది.
ఆలయ పూజారి పిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న గోల్కొండ పోలీసులు కోటలోని దేవాలయాన్ని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను దుండగులు ధ్వంసం చేసినట్లు గుర్తించారు. ఈ చోరీకి ప్రయత్నించిన దుండగులను గుర్తించేందుకు గోల్కొండ కోట ప్రవేశద్వారం వద్ద వున్న సిసి కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. దుండగుల కోసం ప్రత్యేక గాలింపు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
చారిత్రక నగరమైన హైదరాబాద్‌లో ఇలా చారిత్రక ప్రదేశాలను దోపిడి దొంగలు టార్గెట్ గా చేసుకోవడంతో పరిపాటిగా మారింది. గతంలో నగర నడిబొడ్డును వున్న నిజాం మ్యూజియంలో దొంగతనం జరగడం... కోట్లాది రూపాయల విలువ చేసే చారిత్రక సంపదను దొంగలు అపహరించుకుపోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలగించింది. పటిష్టమైన రక్షణ వలయాన్ని చేధించుకుని దొంగలు సునాయాసంగా లోపలికి వెళ్లి విలువైన చారిత్రక సంపద దోచుకోవడం అప్పట్లో కలకలం రేపింది.