ఘరానా దొంగ అరెస్ట్.. 60 చోరీలు... ఇది ట్రాక్ రికార్డ్

First Published Jul 14, 2018, 11:42 AM IST
Highlights

ఈ ఘరానా దొంగకు ఇద్దరు భార్యలు, ఏడుగురు సంతానం...

తాళం వేసి ఉన్న ఇళ్ల లక్ష్యంగా గత కొన్నేళ్లుగా చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఇప్పటికే ఈ దొంగ చోరీ కేసులో లెక్కలేనన్ని  సార్లు జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలై బయటకు రాగానే.. మళ్లీ చోరీలు చేయడం మొదలుపెట్టేవాడు. తాజాగా మరోసారి పోలీసులకు చిక్కాడు.

ఈ ఘరానా దొంగ గురించి పూర్తి వివరాలు పోలీసులు వివరించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన మహ్మద్‌ మహబూబ్‌ పాషా అలియాస్‌ బిర్యానీ పాషా 7వ తరగతి మానేసి హోటల్లో పనికి కుదిరాడు. 2001లో పెళ్లి చేసుకున్న అతడు జల్సాలకు అలవాటుపడి తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. 

2008లో మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఇద్దరు భార్యలకు కలిపి ఏడుగురు సంతానం. 2001 నుంచి వనపర్తి, బిజినేపల్లి, జడ్చెర్ల, మహబూబ్‌నగర్‌, సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో 50 ఇళ్లలో చోరీ చేశాడు. పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. 2016లో వనస్థలిపురం పోలీసులు పాషాపై పీడీ యాక్ట్‌ నమోదు చేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జైలునుంచి విడుదలైన తర్వాత మళ్లీ చోరీలు చేయడం ప్రారంభించాడు. కుషాయిగూడ, కేపీహెచ్‌బీ మాదాపూర్‌ తదితర ప్రాంతాల్లో 10 ఇళ్లను లూటీ చేశాడు. కుషాయిగూడ పోలీసులు నిఘా పెట్టి పాషాను అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 32 తులాల బంగారం, 7.5 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 

సొత్తు విలువ రూ. 13 లక్షలు ఉంటుందని సీపీ వెల్లడించారు. అతడిపై మరోసారి పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామన్నారు. నిందితుడిని పట్టుకున్న కుషాయిగూడ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాములు, డీఎస్‌ఐ చంద్ర‌శేఖర్‌, ఇతర సిబ్బందిని సీపీ అభినందించి నగదు రివార్డులు అందజేశారు. ఒకేసారి రెండు నుంచి మూడు బిర్యానీలు తినే అలవాటు ఉండటంతో అతడికి బిర్యానీ బాషా అనే పేరు వచ్చిందని, విచారణ సమయంలో తెప్పించమని కోరాడని పోలీసులు తెలిపారు
 

click me!