తెలంగాణ ఎన్నికలు: ఫలితాలతో తేలే 10 విషయాలు ఇవే....

By pratap reddyFirst Published Dec 10, 2018, 12:24 PM IST
Highlights

పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు టీఆర్ఎస్ కు మెజారిటీ వస్తుందని తేల్చినప్పటికీ ప్రజా కూటమి మాత్రం తాము గెలుస్తామనే ధీమాతో ఉంది. అయితే, ఈ ఎన్నికల ఫలితాలు కొన్ని విషయాలు తేలే అవకాశాలున్నాయి.

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికలు తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కూడా అగ్నిపరీక్ష పెట్టాయి. ప్రజా కూటమిలో ప్రధాన భాగస్వామి కాంగ్రెసు పార్టీయే అయినప్పటికీ పోటీ మాత్రం కేసీఆర్ కు, చంద్రబాబుకు మధ్య జరిగినట్లుగానే భావిస్తున్నారు. 

పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు టీఆర్ఎస్ కు మెజారిటీ వస్తుందని తేల్చినప్పటికీ ప్రజా కూటమి మాత్రం తాము గెలుస్తామనే ధీమాతో ఉంది. అయితే, ఈ ఎన్నికల ఫలితాలు కొన్ని విషయాలు తేలే అవకాశాలున్నాయి.

1. చంద్రబాబుతో కూటమి కట్టి, ఆయనను ప్రచారంలోకి దింపడం ద్వారా కాంగ్రెసు ప్రయోజనం పొందిందా, నష్టపోయిందా అనేది తేలుతుంది. కేసిఆర్ సహా టీఆర్ఎస్ నేతలు చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఎన్నికల ప్రచారంలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పెత్తనం తెలంగాణలో ఎందుకనే కేసీఆర్ ప్రశ్నను ఎంత మేరకు ప్రజలు అంగీకరించారనేది తేలనుంది. 

2. తెలంగాణ ముస్లిం మైనారిటీలు ఏ వైపు ఉన్నారనే విషయం కూడా ఎన్నికల ఫలితాల ద్వారా తేలనుంది. మజ్లీస్ ను మిత్రపక్షంగా ప్రకటించుకోవడం ద్వారా ముస్లింల మద్దతును టీఆర్ఎస్ పొందిందా, లేదా అనే విషయం తేటతెల్లం కానుంది. లేదంటే, 12 శాతం రిజర్వేషన్ల కల్పనలో కేసీఆర్ విఫలమయ్యారనే వారు టీఆర్ఎస్ కు దూరమయ్యారా, తిరిగి కాంగ్రెసు వైపు వచ్చారా అనేది స్పష్టమవుతుంది. 

3. 2014 ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ద్వారా అధికారాన్ని చేపట్టింది. దక్షిణ తెలంగాణలో మాత్రం అంతంత మాత్రంగానే సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు అదే ఒరవడి కొనసాగుతుందా, రాష్ట్రవ్యాప్తంగా ఇరు పక్షాల మధ్య సీట్లు చీలుతాయా అనేది తేలుతుంది. దక్షిణ తెలంగాణ ఎప్పటి లాగే కాంగ్రెసుకు అనుకూలంగా ఉంటుందా అనే విషయం కూడా స్పష్టం కానుంది. ఉత్తర తెలంగాణ ఎప్పటిలాగే టీఆర్ఎస్ కోటగా ఉందా, లేదా అనేది తేలుతుంది. 

4. ఆంధ్ర సెటిలర్లు ఎటువైపు మొగ్గు చూపారనేది తేలనుంది. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలోని ఫలితాలు, జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల ఫలితాలు ఆ విషయాన్ని తెలియజేస్తాయి. టీఆర్ఎస్ తరఫున గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు పలువురు ఉన్నారు. వారు తెరిగి గెలుస్తారా, లేదంటే వారిని చంద్రబాబు వైపు ఉన్నారా అనేది తేలనుంది. అదే సమయంలో టీడీపి నుంచి జరిగిన ఫిరాయింపులను ప్రజలు అంగీకరించారా, లేదా అనేది కూడా తేలనుంది. 

5. తెలంగాణ ఓటర్లు ఏదో ఒక వైపు మొగ్గు చూపారా, లేదా అనేది తేలనుంది. హంగ్ అసెంబ్లీ వస్తుందా, స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు ఏదో ఒక పక్షానికి ఓట్లేశారా అనేది స్పష్టం కానుంది. అలా ఎందుకు జరిగిందనే విషయం తేలనుంది. బిజెపి, బిఎల్ఎఫ్, స్వతంత్రుల వల్ల లాభం ప్రజా కూటమికి జరిగిందా, టీఆర్ఎస్ కు జరిగిందా అనేది తేలనుంది. 

6. ఈసారి కొంత మంది స్వతంత్రులు గెలుస్తారనే అంచనా నడుస్తోంది. ఆ స్వతంత్రులు ఏ పార్టీ రెబెల్స్ అనేది తేలనుంది. వారు ప్రజా కూటమి వైపు ఉంటారా, టీఆర్ఎస్ వైపు ఉంటారా అనేది ఫలితాలపై ఆధారపడవచ్చు. 

7. ప్రజా కూటమిలో మిత్రపక్షాల మధ్య ఓట్ల బదిలీ జరిగిందా, లేదా అనేది తేలనుంది. టీడీపి ఓట్లు కాంగ్రెసుకు, కాంగ్రెసు ఓట్లు టీడీపికి పడ్డాయా లేదా అనే విషయంపై స్పష్టత రానుంది. 

8. ముఖాముఖి పోటీలు ఎవరికి లాభించాయి, బహుముఖ పోటీలు ఎవరికి లాభించాయనేది తేలనుంది. బహుముఖ పోటీలు ఉన్న చోట కాంగ్రెసుకు ప్రయోజనం పొందిందా, టీఆర్ఎస్ లబ్ధి పొందిందా అనేది తేలనుంది. 

9. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో ఈసారి కులం ప్రధాన పాత్ర పోషించింది. కుల ప్రాతిపదికపై ఓటర్లు చీలిపోయినట్లు భావిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికలను వెలమ, రెడ్డి సామాజిక వర్గాల మధ్య పోటీగా చెబుతున్నారు. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు తొలిసారి కలిసి పనిచేశాయి. ఈ ఫలితం ఎలా ఉండబోతుందనేది తేలనుంది. 

10. చివరగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు భవిష్యత్తును కూడా ఈ ఫలితాలు నిర్ణయించే అవకాశం ఉందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. అందువల్ల ఈ ఎన్నికలు కేసిఆర్ కే కాకుండా చంద్రబాబుకు కూడా అగ్నిపరీక్షగా భావిస్తున్నారు. 

click me!