నాట్యతోరణం దేశ సంస్కృతికి ప్రాణం ఆభరణం: అమ్రిత కల్చరల్ ట్రస్ట్

By Rajesh KFirst Published Dec 12, 2021, 11:15 AM IST
Highlights

హైద‌రాబాద్ లోని మాదాపూర్ -ఆంఫీ థియేటర్ లో అమ్రిత కల్చరల్ ట్రస్ట్ వారి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న హైదరాబాద్ శాస్త్రీయ నృత్య మహోత్సవం ప్రేక్ష‌కుల‌ను ఎంతోగానో అల‌రించింది. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌దర్శించిన నృత్య రీతులు ఆహూతులకు న‌య‌న మ‌నోహ‌రంగా సాగాయి.
 

Hyderabad: న‌గ‌రంలోని మాదాపూర్ -ఆంఫీ థియేటర్ లో అమ్రిత కల్చరల్ ట్రస్ట్  ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన హైద‌రాబాద్ శాస్త్రీయ నృత్య మహోత్సవం  ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నది. నృత్య మ‌హోత్స‌వంలో కూచిపూడి, కథక్, ఒడిస్సా, భరతనాట్య వంటి క‌ళారీతుల‌ను రూపకాలను తిలకించి ప్రేక్షకులు తన్మయత్వంలో మునిగితేలారు. అమ్రిత కల్చరల్ ట్రస్టు తొలిసారి  హైదరాబాద్ శాస్త్రీయ నృత్య మహోత్సవం పేరిట నిర్వహించిన నాట్యతోరణంలో ప్రదర్శితమైన నృత్య ప్రదర్శనలు దేశ సంస్కృతికి ప్రతిరూపంగా నిలిచాయి. 

భారతీయ కళా, సంస్కృతిని చాటేందుకు తద్వారా దేశ ఆధ్యాత్మికతను వెల్లడి పరిచేందుకు ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమాలలో భాగంగా శనివారం సాయంత్రం మాదాపూర్ లోని సెంటర్ ఆఫ్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్ వారి ఆంఫీ థియేటర్ లో కూచిపూడి,కథక్, ఒడిస్సా, భరతనాట్య ప్రదర్శనలతో ప్రాంగణం మువ్వల సవ్వడితో నింపింది. ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజేష్ పగడాల పర్యవేక్షణలో ట్రస్ట్    సభ్యుల బృందం సమర్థవంతంగా నిర్వహించారు.

హైద‌రాబాద్ కు  చెందిన మురమళ్ళ సురేంద్రనాథ్  కూచిపూడి నృత్యప్రదర్శన ప్రతిభాన్వితంగా సాగింది. ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా వస్తున్న కళాసంపదను పరిరక్షించుకుంటూ నాట్యాచార్యునిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దేశవిదేశాలలో ప్రదర్శనలిస్తూ అందరి అభిమానానికి పాత్రులైన సురేంద్రనాథ్ ప్రతి అంశాన్ని రమణీయంగా ప్రదర్శించారు.

ద్వితీయ ప్రదర్శనగా బెంగ‌ళూర్ కు చెందిన నిదగ కరునాద్ ప్ర‌ద‌ర్శించిన‌ కథక్ నృత్యం ఎంతో 
మనోహరంగా సాగింది. ఆ తరువాత‌.. పాండిచ్చేరికి చెందిన అభయాకారం కృష్ణన్ ప్ర‌ద‌ర్శించిన భారత నాట్య ప్రదర్శన ప్రేక్షకులకు కనువిందు చేస్తూ సాగింది. ఆ త‌రువాత కేర‌ళ‌కు చెందిన బిజిన ప్ర‌ద‌ర్శించిన మోహినియట్టం ఆద్యంతం మ‌నోహ‌రంగా సాగింది. ఐదవ ప్రదర్శనగా భార్గవి పగడాల (హైదరాబాద్) కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రశంసాయుతంగా సాగింది. ఆరవ ప్రదర్శనగా శ్వేతా కృష్ణ (బెంగుళూరు) ఒడిస్సీ నాట్యం ఆసాంతం ప్రేక్షకులకు కనువిందు చేస్తూ సాగింది. 

ఈ కార్య‌క్ర‌మానికి గౌరవ అతిథులుగా బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్, విదేశీ కామన్వెల్త్ ఆఫీస్ డాక్టర్ ఆండ్రు ఫ్లేమింగ్, డాక్టర్ ఎస్ చెల్లప్ప(విశ్రాంత ఐఎఎస్ అధికారి),తెలంగాణ రాష్ట్ర భాషా సంస్కృతుల శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు స్వీకర్త, ఆంధ్రనాట్య విద్యాకోవిదులు ఆచార్య కళాకృష్ణ, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు స్వీకర్త కూచిపూడి,భరతనాట్య విశారదులు పసుమర్తి రామలింగశాస్త్రి, ప్రసిద్ధ ఒడిస్సి నాట్య విదూషిణి నయనతార నంద కుమార్, సి సి ఆర్ టి ప్రత్యేక అధికారి తాడేపల్లి సత్యనారాయణశర్మ తదితరులు హాజ‌ర‌య్యారు. 


ఈ మ‌హోత్స‌వాన్ని నిర్వ‌హకులు మాట్లాడుతూ.. కళలు మానసిక వికాసాన్ని కలిగిస్తాయని, నాట్యం మానసిక వికాసం శారీరక దారుఢ్యం కలిగిస్తుందని అన్నారు. జాతి ఔన్నత్యాన్ని తెలిపేవి కళలేనని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన మన భారతదేశంలోని పలు రాష్ట్రాలలోని నృత్యాలను ఒకే వేదికపై ప్రదర్శింపచేసి సమైక్యతకు,కళల పునర్వైభవానికి ప్రారంభ కార్యక్రమంతో శ్రీకారం చుట్టిన ట్రస్ట్ ఉన్నత, ఉత్తమ ఆశయం ప్రశంసించదగినదని అన్నారు. ప్రదర్శనలిచ్చిన యువ కళాకారుల నాట్య వైదుష్యాన్ని కొనియాడుతూ ప్రసంగించారు. 

నృత్యంలో విశేష కృషిచేసిన కళాకారులను, అతిథులను ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజేష్ పగడాల  సత్కరించారు. భారతీయ నాట్యతోరణం దేశ సంస్కృతికి ప్రాణం ఆభరణంగా నిలుస్తుందని,  దేశంలో శాస్త్రీయ నాట్య రంగాలలో కృషిచేసి ప్రతిభతో పేరు గడిస్తున్న యువ నాట్యాచార్యులకు వేదిక కల్పిస్తూ ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ఇటువంటి ఉత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు రాజేష్ పగడాల వేదికపై తెలిపారు.

click me!