టీఆర్ఎస్ పై కేంద్రం చ‌ర్య‌లు తీసుకుంటేనే బీజేపీలో చేరికపై నిర్ణయం : కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి

Published : May 10, 2022, 09:53 AM IST
టీఆర్ఎస్ పై కేంద్రం చ‌ర్య‌లు తీసుకుంటేనే బీజేపీలో చేరికపై నిర్ణయం : కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి

సారాంశం

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నాయకులు అవినీతికి పాల్పుడుతున్నారని చెప్పారు. అయినా వారిపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. టీఆర్ఎస్ పై యుద్ధం చేసే ఏ పార్టీకైనా తాను సపోర్ట్ చేస్తానని తెలిపారు. 

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు అవినీతికి పాల్పుడుతున్నా.. కేంద్ర ప్ర‌భుత్వం ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి  అన్నారు. సీబీఐ, ఈడీ వంటి ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో ఎందుకు విచార‌ణ జ‌ర‌ప‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. ఈ విష‌యంలో వెన‌క‌డుగు ఎందుకు వేస్తోంద‌ని అన్నారు. 

టీఆర్ఎస్ ప్ర‌భుత్వ పెద్ద‌లపై కేంద్ర ప్ర‌భుత్వం తీసుకునే చ‌ర్య‌ల ఆధారంగానే తాను బీజేపీలో చేరే నిర్ణయం ఆధార‌ప‌డి ఉంటుంద‌ని తెలిపారు. దాదాపు మ‌రో నెల రోజుల పాటు ఏ పార్టీలో చేర‌కుండా ఇండిపెండెంట్ గానే ఉంటాన‌ని అన్నారు. టీఆర్ఎస్ పార్టీపై భార‌తీయ జ‌నతా పార్టీ ఇంక గ‌ట్టిగా పోరాటం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. అలా చేస్తే త‌న‌తో పాటు మ‌రో ముప్పై మంది క‌మ‌లం పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నార‌ని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరాల‌ని ఆ పార్టీ ప్రెసిడెంట్ నుంచి త‌న‌పై ఎలాంటి ఒత్తిడి లేద‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నొక్కి చెప్పారు. సీఎం కేసీఆర్ కుటుంబ పాల‌న‌కు, టీఆర్ఎస్ పార్టీకి ఎవ‌రైతే ఎదురెళ్లి, బ‌లంగా పోరాటం చేస్తారో ఆ పార్టీకే తాను స‌పోర్ట్ చేస్తాన‌ని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి అన్నారు. 

ఇదిలా ఉండ‌గా.. కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి బీజేపీలో చేర‌తార‌ని గ‌త కొంత కాలం నుంచి టాక్ న‌డుస్తోంది. దానికి బ‌లం చేకూరుస్తూ ఇటీవ‌ల మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో ఆయ‌న పాద‌యాత్ర చేప‌డుతున్న బండి సంజ‌య్ ను క‌లిశారు. ఆయ‌న వెంట మ‌రో నాయ‌కుడు జితేంద‌ర్ రెడ్డి ఉన్నారు. బండి సంజ‌య్ కు, విశ్వేశ్వర్ రెడ్డికి మ‌ధ్య దాదాపు రెండు గంట‌ల పాటు చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న బీజేపీలో చేర‌డం దాదాపుగా ఖారారు అయిపోయిన‌ట్టుగానే వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఈ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు స్ప‌ష్టత రాలేదు. 

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేప‌ట్టిన ప్ర‌జా సంగ్రామ యాత్ర మే 14వ తేదీన తుక్కుగూడ‌లో ముగుస్తుంది. ఈ సందర్భంగా అక్క‌డ స‌భ ఏర్పాటు చేయాల‌ని బీజేపీ భావిస్తోంది. ఈ కార్య‌క్ర‌మానికి సెంట్ర‌ల్ హోం మినిస్ట‌ర్ అమిత్ షా హాజ‌రుకానున్నారు. ఈ స‌మావేశంలోనే కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి పార్టీలో చేర‌తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ఆయ‌న మ‌రో నెల రోజుల పాటు ఏ పార్టీలో చేర‌బోర‌ని ఆదివారం స్ప‌ష్టం చేశారు. 

బిజినెస్ మెన్ గా ఉన్న కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిని సీఎం కేసీఆర్ 20113 సంవ‌త్స‌రంలో టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న టీఆర్ఎస్ త‌రఫున చేవెళ్ల ఎంపీగా ఎన్నిక‌య్యారు. అయితే ఆయ‌న ఒక్క సారిగా 2018 సంవ‌త్స‌రంలో టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. అనంత‌రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే 2019 ఎన్నిక‌ల్లో అదే స్థానం నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున ఎంపీగా పోటీ చేసిన‌ప్ప‌టికీ విజ‌యం సాధించ‌లేక‌పోయారు. 2021 మార్చిలో ఆయ‌న కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. అప్ప‌టి నుంచి ఆయ‌న ఏ పార్టీలో చేర‌కుండానే ఉన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే