మరో 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..

By Sairam IndurFirst Published Mar 28, 2024, 9:53 AM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని మరో నాలుగు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఒక్కరు మినహా.. మిగిలిన ముగ్గురు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి.

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డాయి. అందులో భాగంగానే తెలంగాణలోని మరో 4 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) బుధవారం రాత్రి న్యూఢిల్లీలో సమావేశమై ఎనిమిదో జాబితాలో తెలంగాణకు చెందిన నలుగురు సహా మొత్తంగా పద్నాలుగు మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ (ఎస్టీ) నుంచి ఆత్రం సుగుణ, మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయనున్నారు. జీవన్ రెడ్డి మినహా మిగితా వారందరూ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. జీవన్ రెడ్డి ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన గతేడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 

అయినప్పటికీ సుధీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించిన అధిష్టానం.. నిజామాబాద్ లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక ఆదిలాబాద్ నుంచి పోటీ చేయబోతున్న ఆత్రం సుగుణ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉన్నారు. ఇక నీలం మధు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పని చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ కేటాయించలేదు. 

దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ పలు కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు టికెట్ కేటాయించలేదు. తరువాత నీలం మధు.. బీఎస్పీలో చేరి, ఆ పార్టీ తరుఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ బీసీ కోటాలో మెదక్ టికెట్ కేటాయించనట్టు తెలుస్తోంది.కాగా.. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ (ఎస్సీ) స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఈ నెల 31న సీఈసీ మరోసారి సమావేశం కానుంది.

click me!