ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో ఆదివాసీలు ఆందోళనకు దిగారు. ఆదివాసీల రిజర్వేషన్లలో మరో 11 కులాలను కలపడాన్ని ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారు.
ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఐటీడీఏ వద్ద సోమవారం నాడు ఉద్రిక్తత నెలకొంది. ఆదివాసీ రిజర్వేషన్ లో 11 కులాలను కలపడాన్ని నిరసిస్తూ ఆదివాసీలు ఆందోళన నిర్వహించారు. ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఐటీడీఏ కార్యాలయం ముందు వాహనాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు.ఐటీడీఏ కార్యాలయంపై రాళ్లతో దాడికి దిగారు.దీంతో ఉద్రిక్తత నెలకొంది.
తమ రిజర్వేషన్లలో 11 కులాలను కలపడాన్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇటీవల ఇదే విషయమై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని ఆందోళనకారులు గుర్తు చేశారు. . ఈ విషయమై తమకు ప్రభుత్వం నుండి సమాధానం ఇవ్వాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. తమ ఉపాధి అవకాశాలను దెబ్బతీసేందుకు 11కులాలను తమ రిజర్వేషన్ లో కలపారని ఆందోళనకారులు ఆరోపించారు.