జెడ్పీటీసీ హత్యతో గుజ్జకుంటలో తీవ్ర ఉద్రిక్తత.. అనుమానితుల ఇళ్లపై దాడి..

By Sumanth KanukulaFirst Published Dec 27, 2022, 1:55 PM IST
Highlights

సిద్దిపేట జిల్లాలో గుజ్జకుంటలో సోమవారం చేర్యాల జెడ్పీటీసీ మల్లేశం దారుణ హత్యకు గురైన సంగతి  తెలిసిందే. మల్లేశం హత్యకు నిరసనగా కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. అనుమానితుల ఇళ్లపై దాడి చేశారు.

సిద్దిపేట జిల్లా గుజ్జకుంటలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గుజ్జకుంటలో నిన్న  చేర్యాల జెడ్పీటీసీ మల్లేశం దారుణ హత్యకు గురైన సంగతి  తెలిసిందే. మల్లేశం హత్యకు నిరసనగా కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. హత్యకు కారకులైనవారిని పట్టుకునేంతవరకు అంత్యక్రియలు చేయబోమని ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల నిరసనకు దిగారు. అనుమానితుడు సత్తయ్య ఇంటి అద్దాలు పగలగొట్టారు. మరో అనుమానితుడు చంద్రకాంత్ ఇంటి అద్దాలు, బైక్‌, కారు ధ్వంసం చేశారు. నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. 

స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వచ్చి మల్లేశం బంధువులు, కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు యత్నించిన కూడా వారు వెనక్కి తగ్గలేదు. సత్తయ్య, చంద్రకాంత్‌లను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే అంత్యక్రియలను నిర్వహిస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలోనే గుజ్జకుంటలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్‌ఎస్‌ జెడ్పీటీసీ సభ్యుడు మల్లేశం తాను నివాసం ఉంటున్న గుజ్జకుంటలో దారుణ హత్యకు గురయ్యారు. మార్నింగ్‌ వాక్‌కు వెళ్తుండగా సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను నరికి చంపారు. కొడవళ్లు, గొడ్డళ్లతో దాడి చేశారు. రోడ్డుపై రక్తపుమడుగులో పడిఉన్న మల్లేశంను కుటుంబ సభ్యులు, స్థానికులు చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగానే మల్లేశం మార్గమధ్యలో మృతిచెందారు. 

పోస్టుమార్టం అనంతరం మల్లేశం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. హత్యకు భూమి సంబంధిత సమస్యలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.అయితే నిందితులను ఇంకా అరెస్టు చేయనట్టుగా తెలుస్తోంది. మరోవైపు మల్లేశం హత్యపై మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హత్యకు కారకులైన వారిని అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు.

click me!