మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరు బాలింతల మృతి:: బంధువుల ఆందోళన, ఉద్రిక్తత

By narsimha lode  |  First Published Jan 13, 2023, 2:12 PM IST

మలక్ పేట  ప్రభుత్వాసుపత్రిలో  ఇద్దరు  బాలింతలు  మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే వీరిద్దరూ మృతి చెందారని  మృతుల కుటుంబసభ్యులు  ధర్నాకు దిగారు. 


హైదరాబాద్: నగరంలోని  మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో  ఇద్దరు బాలింతలు  ఒకే రోజున మృతి చెందారు.  దీంతో  మృతుల బంధువులు  శుక్రవారం నాడు  ఆసుపత్రి ముందు  ఆందోళనకు దిగారు.నాగర్ కర్నూల్  జిల్లాకు చెందిన  సిరివెన్నెల  రెండో కాన్పు కోసం  మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో  చేరింది.  ఆమెకు సిజేరియన్ చేసిన  తర్వాత  అస్వస్థతకు గురైంది.  దీంతో  గాంధీ ఆసుపత్రికి తరలించారు.  గాంధీ ఆసుపత్రిలో  చికిత్స  పొందుతూ   సిరివెన్నెల మృతి చెందింది.  మరో వైపు ఇదే ఆసుపత్రిలో మొదటి కాన్పు  కోసం మలక్ పేట ఆసుపత్రిలో  శివానీ జాయిన్ అయింది.  సిజేరియన్ తర్వాత  శివానీ  అస్వస్థతకు  గురైంది . ఆమెకు చికిత్స అందించేందుకు  గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో చికిత్స పొందుతూ శివానీ  మృతి చెందింది. వైద్యుల  నిర్లక్ష్యం వల్లే  ఈ ఇద్దరు మృతి చెందారని  కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు  ఇవాళ  ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. 

మలక్ పేట ఆసుపత్రి నుండి  సిరివెన్నెలను  గాంధీ ఆసుపత్రికి తరలించిన తర్వాత వైద్యులు  ఆమెను పరీక్షించారు. డెంగ్యూ  ఉన్నా కూడా ఆమెకు శస్త్రచికిత్స ఎలా నిర్వహించారని వైద్యులు  ప్రశ్నించారని బాధిత కుటుంబ సభ్యులు  ఆరోపిస్తున్నారు. పరీక్షలు చేయకుండానే  ఎలా  ఆపరేషన్ చేశారని  మృతురాలి బంధువులు ప్రశ్నిస్తున్నారు.

Latest Videos

మరో వైపు డెలీవరీ కోసం  చేరిన శివానీకి  థైరాయిడ్ సమస్య ఉందని  వైద్యులు  చెబుతున్నారు. ఈ నెల  10వ తేదీన  శివానీ ఆసుపత్రిలో చేరింది.ఈ నెల  11న ఆమెకు సిజేరియన్ చేశారు. అయితే  ఈ నెల  12న రాత్రి ఆమె అస్వస్థతకు  గురైంది . దీంతో ఆమెను  వెంటనే  గాంధీకి తరలించారు. గాంధీలో చికిత్స పొందుతూ  శివానీ మృతి చెందింది.

మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరు బాలింతల మృతిలో  వైద్యుల  నిర్లక్ష్యం లేదని డీసీహెచ్ డాక్టర్ సునీత ప్రకటించారు. అయితే  ఈ  విసయమై  విచారణ నిర్వహిస్తామన్నారు. ఈ విచారణలో  వైద్యుల నిర్లక్ష్యం ఉందని తేలితే చర్యలు తీసుకొంటామని డీసీహెచ్  స్పష్టం చేశారు.  బాలింతల మృతికి  డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని  కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  ఆసుపత్రి ముందు  ఆందోళన చేస్తున్నవారికి  నచ్చజెప్పేందుకు  పోలీసులు  ప్రయత్నించారు. తమకు న్యాయం చేయాలని  బాధిత కుటుంబ సభ్యులు  డిమాండ్  చేశారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని  వారు డిమాండ్  చేశారు. దీంతో  ఆసుపత్రి వద్ద  ఉద్రిక్తత నెలకొంది. 
 

click me!