దేశం మొత్తం తెలంగాణ మోడల్ ను అమలు చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు
సత్తుపల్లి:కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీలు ప్రజలకు అవసరం లేదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ప్రజల అవసరాలను తీర్చుతూ ప్రజల మధ్య ఉండే లా బీఆర్ఎస్ ను దేశంలో విస్తరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రసంగించారు. తెలంగాణ మోడల్ ను దేశం మొత్తం అమలు చేసే ఉద్దేశ్యంతో కేసీఆర్ బీఆర్ఎస్ ను ప్రారంభించారన్నారు. ఈ సమయంలో కేసీఆర్ కు మనమంతా అండగా ఉండాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
undefined
తెలంగాణ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు చేసేలా కేంద్రం నుండి అనుమతి తీసుకువచ్చిన ఘనత కేసీఆర్ దేనని మాజీ మంత్రి చెప్పారు. దేశంలో వేలాది టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయన్నారు. వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిని సాగు, తాగు నీటికి ఉపయోగించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం అనుసరించిన విధానాలతో ముందుకు వెళ్తే దేశంలో సాగు, తాగు నీటికి ఇబ్బందులుండవని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ కు అండగా నిలిస్తే దేశ వ్యాప్తంగా పార్టీని కేసీఆర్ విస్తరింపజేసేందుకు ప్రయత్నిస్తారన్నారు.తెలంగాణను సాధించుకొని రాస్ట్రంలోని సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లిన విషయాన్ని తుమ్మల నాగేశ్వరరావు గుర్తు చేశారు. దేశంలో కూడా ప్రజల సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ బీఆర్ఎస్ ను నడిపించనున్నారని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దేశాన్ని సమర్ధవంతంగా ముందుకు నడిపించడానికి బీఆర్ఎస్ పనిచేయనుందన్నారు. ఖమ్మం జిల్లాలో ఆరేడేళ్లుగా ఎలాంటి సమస్యలు లేవన్నారు.
ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో బీఆర్ఎస్ సభను ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సభకు మూడు రాష్ట్రాల సీఎంలతో పాటు మాజీ సీఎంలను కూడా ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సభకు కనీసం ఐదు లక్షల మందిని తరలించనున్నారు. ఈ సభ నిర్వహణ బాధ్యతలను మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, హరీష్ రావు ,వేముల ప్రశాంత్ రెడ్డికి కేసీఆర్ అప్పగించారు. ఈ సభకు జనసమీకరణ ఏర్పాట్లపై రెండు మూడు రోజులుగా హరీష్ రావు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాకు చెందిన నేతలతో హరీష్ రావు చర్చిస్తున్నారు.