TS Elections: కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లిలో మంగళవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ - బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
TS Elections: కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లిలో మంగళవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ - బీజేపీ శ్రేణులు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతలు ఓటర్ల స్లిప్పుల పేరుతో డబ్బులు పంచుతుండగా అడ్డుకున్నామని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. తమను అడ్డుకున్న బీజేపీ శ్రేణులతో బీఆర్ఎస్ కార్యకర్తలు గొడవకు దిగారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య పరస్పరం దాడులు చేసుకున్నట్లు తెలుస్తోంది. డబ్బుల పంపిణీ జరుగుతోందని చెప్పినా అడ్డుకోవడం మానేసి.. తమనే అడ్డుకుంటున్నారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు .. ఓటర్లను మభ్యపెట్టెలా.. డబ్బులు పంచుతున్నారనే సమాచారం అందటంతో బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వెంటనే కొత్తపల్లికి చేరుకున్నారు.రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు పంచుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలను బీజేపీ కార్యకర్తలు పట్టుకున్నా.. వారిని పోలీసులు పట్టించుకోవడం లేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంత బాహాటంగా డబ్బులు పంచుతుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలతో కలసి బండి సంజయ్ సంఘటన స్థలంలోనే ధర్నాకు దిగారు. బండి సంజయ్ స్వయంగా ఆందోళనకు దిగడంతో అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తతంగా మారినట్టు తెలుస్తోంది. మరోవైపు .. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు పార్టీ నేతలకు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.