Animal: అంతటా తెలుగోళ్లే ఏలుతారు.. హైదరాబాద్‌కు రావాల్సిందే: రణ్‌బీర్ కపూర్‌పై మంత్రి మల్లారెడ్డి సంచలనం

By Mahesh K  |  First Published Nov 28, 2023, 5:12 PM IST

యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఐదేళ్లలో హాలీవుడ్, బాలీవుడ్‌లను తెలుగోళ్లే పాలిస్తారని, మరో ఏడాదికల్లా రణ్‌బీర్ కపూర్ కూడా హైదరాబాద్‌కు షిప్ట్ కావాల్సిందేనని మల్లారెడ్డి అన్నారు.
 


హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి నేత, మంత్రి మల్లారెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌ కూడా హైదరాబాద్‌కు రావాల్సిందేనని అన్నారు. వచ్చే ఐదేళ్లలో హాలీవుడ్, బాలీవుడ్ మొత్తం తెలుగోళ్లే ఏలుతారని తెలిపారు.

‘వినండి.. మిస్టర్ రణ్‌బీర్ కపూర్, ఐదేళ్లలో హాలీవుడ్, బాలీవుడ్ అన్నింటినీ తెలుగు ప్రజలే ఏలుతారు. ఒక్క ఏడాది తర్వాత మీరు హైదరాబాద్‌కు మారాల్సిందే’ అని చామకూర మల్లారెడ్డి అన్నారు. ‘ముంబయి పాతదైపోయింది. బెంగళూరులో మొత్తం ట్రాఫిక్ జామ్. ఒక్క హైదరాబాద్ మాత్రమే దేశాన్ని ఏలుతుంది’ అని వివరించారు.

Latest Videos

రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా తారలుగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేదికపై మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: నన్ను హీరోని చేసింది తెలుగువారే.. ఆ డైరెక్టర్ కు రుణపడి ఉంటా.. అనిల్ కపూర్ కామెంట్స్..

‘రాజమౌళి, దిల్ రాజ్‌లు స్మార్ట్. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా కూడా వచ్చారు. మా హీరోయిన్ రష్మిక మందన్నా కూడా స్మార్ట్. పుష్ప సినిమా సంచలనమైంది. అశ్వమేధ యాగం ఇక్కడే మల్లారెడ్డి యూనివర్సిటీలో చేపట్టారు. మీ సినిమా యానిమల్ రూ. 500 కోట్లు వసూలు చేస్తుంది’ అని బీఆర్ఎస్ నేత అన్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహేశ్ బాబు, రాజమౌళి, అనిల్ కపూర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్న సంగతి తెలిసిందే.

click me!