అర్ధరాత్రి దాటాక ఉద్రిక్తత.. మునుగోడు నియోజకవర్గానికి బయలుదేరిన బండి సంజయ్.. అరెస్టు చేసిన పోలీసులు

By team teluguFirst Published Nov 3, 2022, 4:19 AM IST
Highlights

హైదరాబాద్ నుంచి మునుగోడుకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అబ్దుల్లా మెట్ పూర్ వద్ద ఆయనను అడ్డుకొని స్థానిక పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. 

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి తెలంగాణ రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, లీడర్లు ఉప ఎన్నిక జరుగుతున్న మునుగోడు నియోజకవర్గంలోనే ఉంటున్నా ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని బండి సంజయ్ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత బీజేపీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ఆయన హైదరాబాద్ సిటీ నుంచి మునుగోడుకు బయలుదేరారు. దీంతో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. 

మునుగోడులో ప్రలోభాల పర్వం.. చౌటుప్పల్‌లో కారును పట్టుకున్న స్థానికులు, ఉద్రిక్తత

ముందుగా మలక్ పేట వద్ద పోలీసులు బండి సంజయ్ ప్రయాణిస్తున్న వాహనాన్ని నిలిపివేశారు. కానీ బీజేపీ కార్యకర్తలు వారికి అడ్డుచెప్పారు. ఈ సమయంలో పోలీసులకు, వారికి మధ్య కొంత తోపులాట జరిగింది. దీంతో బండి సంజయ్ వాహనం ముందుకు వెళ్లింది. తరువాత వనస్థలిపురం దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ కూడా కార్యకర్తల సహాయంతో ఆయన ప్రయాణం సాగింది. 

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మంత్రులు, స్థానికేతర ఎమ్మెల్యేలు, అధికార టిఆర్ఎస్ పార్టీ నాయకులు మునుగోడులోనే వుండి ప్రజలను భయభ్రాంతులకు, ప్రలోభాలకు గురి చేస్తున్నారని పదే పదే హెచ్చరించినా పట్టించుకోని పోలీస్ యంత్రాంగం...
(1/2) pic.twitter.com/2yJKqy0P2X

— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp)

కానీ ఎట్టకేలకు అబ్దుల్లాపూర్ మెట్ వద్ద పోలీసులు తమ వాహనాలను రోడ్డుకు అడ్డంగా నిలిపారు. దీంతో బండి సంజయ్ ప్రయాణిస్తున్న వాహనం ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో బీజేపీ కార్యకర్తలు అక్కడే ఆందోళనకు పూనుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అది జాతీయ రహదారి కావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ కు తరలించారు.

Live : https://t.co/pQIRQ24x8k

— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp)

పోలీసుల చర్యను బండి సంజయ్ ఖండించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మంత్రులు, స్థానికేతర ఎమ్మెల్యేలు, అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు మునుగోడులోనే ఉండి ప్రజలను భయభ్రాంతులకు, ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో పదే పదే హెచ్చరించినా పట్టించుకోని పోలీస్ యంత్రాంగం.. ఎన్నికల నియమావళికి లోబడి నిరసన తెలుపుదామని బయలుదేరిన తమని అబ్దుల్లాపూర్ మెట్ వద్ద బలవంతంగా అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేశారని, దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ట్వీట్ చేశారు. 

click me!