Telangana: పెరుగుతున్న ఎండ‌లు.. అగ్నిగుండంలా తెలంగాణ !

Published : Mar 18, 2022, 09:02 PM IST
Telangana: పెరుగుతున్న ఎండ‌లు.. అగ్నిగుండంలా తెలంగాణ !

సారాంశం

Temperatures soar: రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్ర‌త‌లు క్ర‌మంగా పెరుగుతున్నాయి. చాలా జిల్లాల్లో 41 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మున్ముందు ఎండ‌లు మండిపోనున్నాయ‌ని ఐఎండీ హెచ్చ‌రించింది.   

Telangana: ఎండ‌లు మండిపోతున్నాయి. భానుడు భ‌గ‌భ‌గ మండిపోతున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ట్రోగ్ర‌త‌లు పెరిగిపోతుండ‌టంతో మ‌ధ్యాహ్నం వేళ ప్ర‌జ‌లు బ‌య‌ట అడుగుపెట్ట‌డానికి భ‌య‌ప‌డి పోతున్నారు. ఎండ‌లు పెరిగి నేప‌థ్యంలో చ‌ల్ల‌ని చెట్ల కింద ప్ర‌జ‌లు సేద తీరుతున్నారు. వేస‌వి కాలం ప్రారంభంలోనే ఇలా ఎండ‌లు మండిపోవ‌డంతో మున్ముందు ఎలా ఉంటాయోన‌ని ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

ఎండలు మండిపోతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ దాటాయి. మొత్తం 33 జిల్లాల్లో కనీసం 14 జిల్లాల్లో 41 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజధాని హైద‌రాబాద్ నగరంలో గురువారం 39.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. 

రాష్ట్రవ్యాప్తంగా అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్న జిల్లాలు క్ర‌మంగా పెరుగుతున్నాయి. నల్గొండ, నిర్మల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 18.5 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో రాత్రులు కూడా వెచ్చగా మారుతున్నాయి. అధికారులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. రాబోయే కొద్ది రోజులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో వేడిగాలులు వీచే ప‌రిస్థితులు ఉంటాయి. దీంతో ఉష్ణోగ్ర‌త‌లు మ‌రింత‌గా పెరుగుతాయి. కాబ‌ట్టి వ‌డ‌దెబ్బ త‌గ‌ల‌కుండా ప్ర‌జ‌లు ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. 

"మేము 14 జిల్లాలకు తీవ్రమైన హీట్ వేవ్ హెచ్చరికలను జారీ చేస్తున్నాము. ఉత్తర తెలంగాణ అత్యంత వేడిగా ఉంటుంది. తూర్పు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న నల్గొండ మరియు ఆదిలాబాద్‌లో ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది" అని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్‌కు చెందిన సైంటిస్ట్ సి ఇంచార్జి డాక్టర్ ఎ శ్రావణి తెలిపారు.

ఏప్రిల్ మరియు మే నెలల్లో ఉష్ణోగ్రతలు సాధారణంగా 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, ఉత్తరం నుండి వచ్చే వేడి గాలులు ప్రస్తుత పరిస్థితిని ప్రేరేపిస్తున్నాయని, వచ్చే వారం  ఉష్ణోగ్ర‌త‌లు క్ర‌మంగా పెరిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అధికారులు తెలిపారు.

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం గురువారం అత్యధిక ఉష్ణోగ్రతలు న‌మోదైన ప్రాంతాలు ఇలా ఉన్నాయి.. 

పెద్దపల్లి - 42.9 డిగ్రీల సెల్సియస్

నిర్మల్ - 42.5 డిగ్రీల సెల్సియస్

జగిత్యాల్ - 42.3 డిగ్రీ సెల్సియస్

ఆదిలాబాద్ - 42.1 డిగ్రీ సెల్సియస్

భద్రాద్రి కొత్తగూడెం - 41.8 డిగ్రీల సెల్సియస్

ఖమ్మం - 41.8 డిగ్రీల సెల్సియస్

మంచిర్యాల్‌ - 41.7 డిగ్రీ సెల్సియస్

నిజామాబాద్ - 41.5 డిగ్రీల సెల్సియస్

సూర్యాపేట - 41.5 డిగ్రీల సెల్సియస్

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ - 41.4 డిగ్రీల సెల్సియస్

ఇదిలావుండ‌గా, దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్ర‌త‌లు క్ర‌మంగా పెరుగుతున్న ప‌రిస్థితులు ఉన్నాయి. మరోవైపు దేశంలోని మధ్య ప్రాంతంలో వేడిగాలులు వీస్తాయని భార‌త వాతావరణ శాఖ (ఐఎండీ) ఈ వారం ప్రారంభంలో అంచనా వేసింది. IMD పేర్కొన్న వివ‌రాల ప్ర‌కారం.. ఈ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలో వేగంగా పెరుగుదల కూడా నమోదవుతుంది. గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలు, కొంకణ్ ప్రాంతం, పశ్చిమ రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, తూర్పు రాజస్థాన్, ఒడిశాలోని చాలా ప్రాంతాలలో బలమైన వేడి గాలులు వీచే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ఇప్ప‌టికే దేశంలోని దేశంలోని చాలా ప్రాంతాల్లోవేడిగాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!