తెలుగు అకాడమీ నిధుల స్కామ్: యూనియన్ బ్యాంక్, అగ్రసేన్ బ్యాంక్ మేనేజర్ల అరెస్టు

By telugu teamFirst Published Oct 1, 2021, 2:17 PM IST
Highlights

తెలుగు అకాడమీ డబ్బుల గోల్ మాల్ వ్యవహారం కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీతో పాటు అగ్రసేన్ బ్యాంక్ మేనేజర్ పద్మావతిని అరెస్టు చేశారు.

హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ వ్యవహారంలో హైదరాబాదు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. తెలుగు అకాడమీలో 70 కోట్ల రూపాయల మేర గోల్ మాల్ జరిగినట్లు గుర్తించారు. దీనిపై తెలుగు అకాడమీ అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు రంగంలోకి దిగి ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్టు చేశారు. 

యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీని, అగ్రసేన్ బ్యాంక్ మేనేజర్ పద్మావతిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. యూనియన్ బ్యాంక్ నుంచి సహకార బ్యాంకుల పేరు నడుస్తున్న మూడు బ్యాంకులకు తెలుగు అకాడమీకి చెందిన ఫిక్స్ డ్ డిపాజిట్ నిధులు బదిలీ అయినట్లు గుర్తించారు. ఈ మూడు బ్యాంకుల నుంచి వ్యక్తుల ఖాతాల్లోకి డబ్బులు బదిలీ అయ్యాయని చెబుతున్నారు. ఆ మూడు బ్యాంకుల్లో అగ్రసేన్ బ్యాంక్ ఒకటి.

విజయవాడ మార్కంటైల్ బ్యాంకుకు తెలుగు అకాడమీ నిధులు బదిలీ అయినట్లు తెలుస్తోంది. దాన్ని సహకార బ్యాంకుగా చెబుతున్నప్పటికీ అందుకు సంబంధించిన నియమనిబంధనలను అది పాటించడం లేదని సమాచారం. అలాంటి బ్యాంకుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఓ వ్యక్తి సహకార బ్యాంకు పేరు మీద దాన్ని నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 

Also Read: తెలుగు అకాడమీ నిధుల స్కామ్: తవ్వుతున్న కొద్దీ.... మరో గోల్ మాల్ వెలుగులోకి..

తెలుగు అకాడమీకి చెందిన దాదాపు 70 కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగినట్లు గుర్తించారు. ఇందులో ప్రధాన సూత్రధారిని, నిందితులను పోలీసులు గుర్తించారని అంటున్నారు. మస్తాన్ వలీ కేంద్రంగా ఈ అక్రమాలు జరిగినట్లు భావిస్తున్నారు. 

కాగా, తెలుగు అకాడమీ దాదాపు 34 బ్యాంకుల్లో నిధులను ఫిక్స్ డ్ డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, అకాడమీ అధికారులు రెండు లేదా మూడు నమ్మకమైన బ్యాంకులను ఎంపిక చేసుకుని ఫిక్స్ డ్ డిపాజిట్లు చేయకుండా అన్ని బ్యాంకుల్లో ఎందుకు చేశారనే ప్రశ్న ఉదయిస్తోంది. ఆ బ్యాంకుల్లో తమ నిధులు భద్రంగా ఉన్నాయా, లేవా అని గుర్తించే పనిలో తెలుగు అకాడమీ అధికారులు పడ్డారు. 

ఆ బ్యాంకులను గుర్తించి, వాటిలో డబ్బులు భద్రంగా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి దాదాపు 20 మంది ఉద్యోగులను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. వాళ్లంతా బ్యాంకులను గుర్తించలేక సతమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ బ్యాంకులు ఎక్కడెక్కడో ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ఆ డిపాడిట్లు అలా ఎందుకు చేశారు, ఎవరి ప్రోద్బలంతో చేశారనే విషయాలను కనిపెట్టే పని కూడా మరో వైపు జరుగుతోంది.

click me!