అర్థరాత్రి ఐదునెలల చిన్నారి ఆకలి తీర్చిన కేటీఆర్

By telugu news teamFirst Published Apr 18, 2020, 8:54 AM IST
Highlights

దీనిపై స్పందించిన మంత్రి.. వారి కాంటాక్ట్‌ వివరాలు పంపాలని సూచిస్తు.. స్వయంగా వెళ్లి పరిశీలించి సహాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌లను కోరారు. 

ఆకలితో అలమటిస్తున్న ఐదు నెలల చిన్నారి ఆకలిని అర్థరాత్రి తెలంగాణ మంత్రి కేటీఆర్ తీర్చారు. ట్విట్టర్ వేదికగా విషయం తెలుసుకున్న కేటీఆర్ వెంటనే స్పందించి.. చిన్నారి ఆకలి తీర్చారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. తల్లి లేని ఐదు నెలల పాపకు కేటీఆర్ ఆదేశాలతో అర్ధరాత్రి సహాయం అందింది. డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ అర్ధరాత్రి 12.30 గంటలకు ఆ పాప ఇంటికి వెళ్లి పాలు, ఇతర నిత్యావసరాలు అందజేశారు. 

‘ఎర్రగడ్డలోని మా పక్క ఇంట్లో నెలల పాప ఉంది. కొన్నాళ్ల క్రితం తల్లి చనిపోయింది. లాక్‌డౌన్‌తో కూలీ పని చేసుకునే తండ్రి వద్ద డబ్బులు లేవు. కనీసం పాలు కొనే పరిస్థితి లేదు. దయచేసి వారికి సహాయం చేయగలరు’ అని నవీన్‌ అనే వ్యక్తి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. 

దీనిపై స్పందించిన మంత్రి.. వారి కాంటాక్ట్‌ వివరాలు పంపాలని సూచిస్తు.. స్వయంగా వెళ్లి పరిశీలించి సహాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌లను కోరారు. 

ఫసియుద్దీన్‌ వెంటనే వారి ఇంటికి వెళ్లి పాలు, నిత్యావసరాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ పాప కుటుంబాన్ని కలిసి పాలు, నిత్యవసర సరుకులతోపాటు ఆర్థిక సహాయం అందచేశారు. వీరిని మంత్రి కేటీఆర్‌ అభినందించారు.

click me!