కరోనా వేళ గ్రామాన్నే దత్తత తీసుకున్న కానిస్టేబుల్: పేదల ఆకలి తీరుస్తూ...

By Sree sFirst Published Apr 18, 2020, 2:20 AM IST
Highlights

తాజాగా తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ఒక కానిస్టేబుల్ తన సొంత డబ్బులతో ఒక గ్రామాన్నే దత్తత తీసుకొని అక్కడ రేషన్ కార్డులు లేనివారికి నిత్యావసరాలను అందించాడు

కరోనా వైరస్ వేళ లాక్ డౌన్ దెబ్బకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడం, లాక్ డౌన్ నియమాల వల్ల ప్రజలు బయటకు వెళ్లకుండా ఇండ్లలోనే ఉండడంతో రెక్కాడితే కానీ డొక్కాడని వారు ఎందరో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ప్రభుత్వం సహాయం అందిస్తున్నప్పటికీ... ఎక్కడో ఒక దెగ్గర ఎవరో ఒకరు మిగిలిపోతూనే ఉన్నారు. అలా ఆహరం దొరక్కుండా ఉన్న చాలామందికి సామాన్య ప్రజలు తమ చేతనైనంత సహాయం చేస్తున్నారు. 

దేశంలో చాలామంది పోలీసువారు ఈ కరోనా వేళ ప్రజలకు కరోనా వైరస్ కి మధ్య అడ్డుకట్టలుగా నిలబడటమే కాకుండా ప్రజలకు ఏదో ఒక విధంగా సహాయపడుతూనే ఉన్నారు. కొందరు అన్నం పెడుతూ పేదవారి ఆకలి తీరుస్తుంటే.... మరికొందరేమో మాస్కులను అందిస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. 

తాజాగా తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ఒక కానిస్టేబుల్ తన సొంత డబ్బులతో ఒక గ్రామాన్నే దత్తత తీసుకొని అక్కడ రేషన్ కార్డులు లేనివారికి నిత్యావసరాలను అందించాడు. 

మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న లింగం అదే మండలంలోని దుడుగు తాండ అనే గిరిజన తాండాను దత్తత తీసుకొని అక్కడ రేషన్ కార్డు లేని 35 కుటుంబాలకు తలా 4 కిలోల బియ్యం, ఒక లీటర్ నూనె, కిలో పప్పు, కూరగాయలతో కూడిన కిట్ ను పంచాడు. 

కేవలం తన సొంత డబ్బుతో మాత్రమే ఇదంతా చేస్తున్నాడు. లింగం మరో ఇద్దరు సోదరులు సైన్యంలో పనిచేస్తూ దేశ సేవ చేస్తున్నారు. ఇలా కరోనా వేళ తన సొంతడబ్బుతో గ్రామంలోని పేదలకు నిత్యావసరాలను పంచడం నిజంగా ఆదర్శవంతం, అభినందనీయం. 

ఇకపోతే.... గత 24 గంటల్లో దేశంలో 1,007 కొత్త కరోనా కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. శుక్రవారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 13,387కి చేరుకొన్నట్టుగా కేంద్రం ప్రకటించింది.

కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ శుక్రవారం నాడు సాయంత్రం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.24 గంటల్లో 1007 కొత్త కేసులు నమోదైతే 23 మంది మృతి చెందారని కేంద్రం ప్రకటించింది. 

13,387 కేసుల్లో 11,201 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.కరోనా సోకిన 1479 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని ఆయన తెలిపారు.కరోనా సోకినవారిలో 13.06 శాతం మంది రికవరీ అవుతున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.ప్రతి 24 శాంపిల్స్ లో ఒక్కరికి పాజిటివ్ వస్తోందని కేంద్రం ప్రకటించింది. చైనా నుండి టెస్టింగ్ కిట్స్ వచ్చినట్టు అగర్వాల్ తెలిపారు.

click me!