
హైదరాబాద్ : తెలంగాణలో నేడు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఇవాళ అతి భారీ వర్షాలు కురవొచ్చని... ప్రజలు, అధికారులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. భారీ వర్షసూచన నేపథ్యంలో ఈ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ.
ఇప్పటికే రాజధాని హైదరాబాద్ తో పాటు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు జోరందుకున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం దాదాపు 20 సెంటిమీటర్ల వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Read More హైదరాబాద్ : కేవలం బీర్ బాటిల్స్ కోసం... పట్టపగలే యువకుడిని పొడిచిచంపిన దుండుగులు
తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ వర్షాలు మరో రెండ్రోజులు అంటే 20వ వరకు కొనసాగే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 18న వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందనీ... దీని ప్రభావంతో తెలంగాణలోని ఉత్తర జిల్లాలతో పాటు మహబూబాబాద్, వరంగల్ (రూరల్), హనుమకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇక ఇటీవల కురిసిన వర్షాలు ఉత్తర భారతదేశాన్ని అతాలాకుతలం చేసారు.హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి.దీంతో భారీ ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం కూడా జరిగింది. ఇప్పుడిప్పుడే ఈ వర్షాలు, వరదల నుండి ఉత్తరాది రాష్ట్రాల్లో తగ్గుముకం పట్టగా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి.