మరో నాలుగురోజులు వర్షం ముప్పు... అప్పటికప్పుడే కారుమబ్బులు... గంటల్లోనే కుంభవృష్టి: వాతావరణ శాఖ హెచ్చరిక

By Arun Kumar PFirst Published Sep 5, 2021, 9:05 AM IST
Highlights

రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో తెలంగాణవ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని... మరో నాలుగురోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.  

హైదరాబాద్: మరో నాలుగురోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా మరికొన్ని రోజులు వర్షం ముప్పు పొంచివుందన్న నేపథ్యంలో ప్రజలతో పాటు అధికారులు అప్రమత్తంగా వుండాలని సూచించారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ళలోంచి బయటకు రావద్దని... వాగులు,వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. 

ఇప్పటికే బంగాళాఖాతం తుర్పు, మధ్య ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని... దీని ప్రభావంతో రేపటిలోగా ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అంతేకాకుండ చత్తీస్ గడ్ లో 2.1కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడివుందని తెలిపింది. వీటన్నింటి ప్రభావంతో తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులడం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 

అక్కడక్కడా అప్పటికప్పుడే కారుమబ్బులు కమ్మి కేవలం గంటల వ్యవధిలోనే భారీ నుడి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి లోతట్టు ప్రాంతాలు, జలాశయాలు, వాగులు వంకలు, చెరువుల పరిసరాల్లో నివాసముండే ప్రజలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

ఇప్పటికే ఎడతెరిపి లేని వర్షాలతో హైదరాబాద్ తడిసి ముద్దవుతోంది. శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షం కురిసింది. అంబర్‌పేట, గోల్నాక, కాచిగూడ, నల్లకుంట, లంగర్‌హౌస్‌, గోల్కొండ, కార్వాన్‌, మెహిదీపట్నంతో పాటు మీర్‌పేట, బీఎన్‌ రెడ్డి నగర్‌,  వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్‌, కోఠి, అబిడ్స్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జోరు వానల ధాటికి ముసారాంబాగ్‌ వంతెన పైనుంచి మూసీ నీరు ప్రవహిస్తోంది.     

గత రెండు రోజుల పాటు కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ భారీ వ‌ర్షాల‌ కారణంగా ఉస్మాన్‌సాగ‌ర్‌ జలకళ సంతరించుకుంది. జ‌లాశ‌యానికి భారీగా వ‌ర‌ద‌నీరు వచ్చి చేరడంతో అధికారులు ఒక్క అడుగు మేర రెండు గేట్లను ఎత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జల మండలి ఎండీ దాన కిశోర్‌ ప్రజలకు సూచించారు.  
 

click me!