తెలంగాణ యూనివర్శిటీ వీసీ రవీందర్ పై ఏసీబీ విచారణ నిర్వహించాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది.
నిజామాబాద్:తెలంగాణ యూనివర్శిటీ వీసీ రవీందర్ పై ఏసీబీ విచారణకు పాలకమండలి తీర్మానం చేసింది. అయితే ఈ సమావేశానికి వీసీ రవీందర్ హాజరు కాలేదు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనమతులు లేకుండానే నిధులను ఖర్చు చేయడాన్ని సమావేశం తప్పుబట్టింది. ఇంచార్జీ రిజిస్ట్రార్ గా ఉన్న ప్రొఫెసర్ విద్యావర్ధినిపై చర్యలు తీసుకోవాలని ఈ సమావేశం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఇంచార్జీ రిజిస్ట్రార్ తీసుకున్న నిర్ణయాలపై విచారించాలని కూడా ఈ సమావేశం తీర్మానం చేసింది.
అకాడమిక్ కన్సల్టెంట్ శ్రీనివాస్ ను విధుల నుండి తొలగించాలని తీర్మానం చేసింది. బుధవారంనాడు హైద్రాబాద్ లో తెలంగాణ యూనివర్శిటీ పాలకమండలి సమావేశం జరిగింది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మరో వైపు తెలంగాణ యూనివర్శిటీ కొత్త వీసీగా బాధ్యతలు చేపట్టిన యాదగిరి తాను తీసుకున్న నిర్ణయాలను పాలకమండలి ముందుంచారు. తెలంగాణ యూనివర్శిటీ లో నిధుల దుర్వినియోగంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.