
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అతివేగంతో దూసుకొచ్చి మరో మూడు వాహనాలను ఢీకొట్టడంతో ముగ్గురు మృతిచెందగా, ఏడుగురు గాయపడ్డారు. ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు వెళ్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లీబిడ్డ చనిపోగా... తండ్రి మరో కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. మృతులను శివరాంపల్లికి చెందిన వారిగా గుర్తించారు. మరోకారులో వెళ్తున్న వ్యక్తి కూడా ఈ ప్రమాంలో మృతిచెందాడు. ఈ ప్రమాదం చేవెళ్ల మండలంలోని కేసారం గేటు వద్ద చోటుచేసుకుంది.
వివరాలు.. హైదరాబాద్ శివరాంపల్లికి చెందిన రవికిరణ్, స్రవంతి తమ కుమార్తెలు ధ్రువిక, మోక్షలతో కలిసి వికారాబాద్ వైపు వెళ్తున్నారు. మరో వైపు వికారాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఇన్నోవా వాహనం వేగంగా దూసుకొచ్చి.. ఎదురుగా వస్తున్న మూడు కార్లను ఢీకొట్టింది. అందులో రవికిరణ్ దంపతులు ప్రయాణిస్తున్న కారు కూడా ఉంది. ఈ ప్రమాదంలో తల్లి స్రవంతి, కూతురు ధ్రువికలు అక్కడికక్కడే మృతిచెందారు. తండ్రి రవికిరణ్, మరో కూతురు మోక్షలు తీవ్రంగా గాయపడ్డారు.
అతి వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారులో ఉన్న ఫైజల్ కూడా మృతిచెందారు. ఈ ప్రమాదంలో మొత్తంగా ఏడుగురు గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసకున్న పోలీసులు విచారణ చేపట్టారు.