Bandi Sanjay: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఓట్ల కోసం డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) నుంచి డబ్బులు తీసుకున్నా.. బీజేపీకే ఓటేయాలని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజలను కోరారు. డబ్బులు పంచితే చాలు పేదలు తమకే ఓటు వేస్తారనీ, రానున్న ఎన్నికల్లో తమదే గెలుపని సీఎం కేసీఆర్ నమ్ముతున్నారని అన్నారు. అయితే, వారు పంచే డబ్బులు తీసుకోవద్దని చెప్పడం లేదనీ, వారిచ్చే డబ్బులు తీసుకున్నప్పటికీ.. మీరు మాత్రం భారతీయ జనతా పార్టీకే ఓటు వేయాలని కోరారు. "ఎన్నికల కోసం ఆయన పంచుతున్న డబ్బు ఏదైనా సరే, అది ప్రధాని నరేంద్ర మోడీ.. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ పథకాల కోసం ఇచ్చిన మీ డబ్బు, కానీ ఎన్నికల కోసం ఆ డబ్బును బదిలీ చేస్తున్నారు. పేద ప్రజలు తమ ఓటును ఎప్పటికీ అమ్ముకోరు. పేద ప్రజలకు నిజాయితీ మరియు నిబద్ధత ఉంటుంది" అని బండి సంజయ్ అన్నారు.
దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలను ప్రస్తావిస్తూ.. ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ డబ్బు పంచిందని, అయితే ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని బండి సంజయ్ అన్నారు. 'దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ ఓట్ల కోసం రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు పంచిపెట్టింది. ఈ రెండు ఉప ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కు పట్టున్న సిట్టింగ్ స్థానాల్లో మేము విజయం సాధించాం. అదే విధంగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మేము 4 స్థానాల నుండి 48 స్థానాలకు గెలిచాము”అని బండి సంజయ్ అన్నారు. కాగా, వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. దీనిలో భాగంగా భారతీయ జనతా పార్టీ నాయకుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
కాంగ్రెస్ సైతం జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. గత వైభవాన్ని తిరిగి సంపాదించుకోవాలని చూస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్ర నాయకులు ఇప్పటికే వారివారి జిల్లాల్లో పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో భారీ సభలు ఏర్పాటుతో ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధమవుతోంది. దీనిలో భాగంగానే వచ్చే నెలలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటనకు వస్తున్నారు. ప్రస్తుతం అంతర్గత కలహాలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌కు.. రాహుల్ గాంధీ పర్యటన తర్వాత వీటికి చెక్‌పెడుతూ.. ఐక్యంగా ముందుకు సాగాలని నాయకులు భావస్తున్నట్టు తెలిసింది.
అలాగే, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేల వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ.. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ స్థాపించిన తర్వాత ప్రజల్లోకి వెళ్లేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రజ పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపుతూ.. ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆమె తీవ్ర ఆరోపణలు, ఘాటు విమర్శలతో తెలంగాణ టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆమె రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొనసాగుతోంది.