ఇంటర్ బోర్డ్ ఎఫెక్ట్: వాల్యుయేషన్ సెంటర్లలో ఫోన్లు నిషేధం, సీసీ కెమెరాలు

By Siva KodatiFirst Published May 2, 2019, 8:25 PM IST
Highlights

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలు, ఇంటర్ బోర్డ్ ఘోర వైఫల్యం, విద్యార్ధుల ఆత్మహత్యల నేపథ్యంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి అప్రమత్తమైంది.

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలు, ఇంటర్ బోర్డ్ ఘోర వైఫల్యం, విద్యార్ధుల ఆత్మహత్యల నేపథ్యంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి అప్రమత్తమైంది. రాష్ట్రంలో సంప్రదాయ, ఇంజనీరింగ్ కోర్సుల డిగ్రీ, పీజీ, ఇతర పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి తదితర అంశాలపై గురువారం సమీక్ష నిర్వహించింది.

ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైఎస్ ఛైర్మన్లు లింబాద్రి, వెంకట రమణ, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డితో పాటు రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల ఉపకులపతులు సమావేశమై వివిధ అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు.

ఈ క్రమంలో డిగ్రీ, పీజీ పరీక్షల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ముగ్గురు వైఎస్ ఛాన్సలర్లతో కమిటిని నియమించింది. వివిధ సంస్కరణలకు సంబంధించి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు విధించారు. అలాగే వీసీల సమావేశంలో పరీక్షలు, పేపర్ వాల్యుయేషన్‌పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఫలితాలను క్షుణ్ణంగా పరిశీలించాకే విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రతి యూనివర్సిటీ ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, విద్యార్ధులకు మొదటి సంవత్సరంలో ఎక్కువ మార్కులు వచ్చి ఆ తర్వాతి సంవత్సరాల్లో తక్కువ మార్కులు వస్తే క్రాస్ చెక్ చేయాలని అధికారులు తెలిపారు.

పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని అమలు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ప్రభుత్వ కాలేజీలకు తప్పించి మిగిలిన కాలేజీలకు సెల్ఫ్ సెంటర్లు రద్దు చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది.

పేపర్ వాల్యుయేషన్ సెంటర్లలో సెల్‌ఫోన్ల వాడకంపై నిషేధించడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పేపర్ కరెక్షన్‌లో తప్పులు చేస్తే లెక్చరర్లపై చర్యలు తీసుకుంటామని మండలి హెచ్చరించింది. విద్యార్ధులకి ఆన్సర్ షీట్స్ జిరాక్స్ అవకాశం కల్పించాలని తెలిపింది. 

click me!